
పోలీసు ప్రజావాణికి 7..
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణికి 7 వినతులు వచ్చాయి. ఎస్పీ రావుల గిరిధర్ ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని వినతులు స్వీకరించారు. వాటిని పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులను ఆదేశించారు.
ఆత్మహత్యయత్నం..
జిల్లాకేంద్రంలోని బుడగజంగాలకాలనీకి చెందిన ఎస్.శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఎస్పీ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఒంటిపై పెట్రోలు పోసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులు సంపాదించిన ప్లాట్లు, ఇల్లు పంపకంలో పెద్ద మనుషుల పేరుతో జోక్యం చేసుకున్న తాజా మాజీ కౌన్సిలర్ ధౌర్జన్యానికి పాల్పడుతున్నారని.. రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని తెలిపారు. గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తమై వారిని నిలువరించారు. అనంతరం బాధితుడిని ఎస్పీ వద్దకు తీసుకెళ్లగా తనకు జరిగిన అన్యాయం, పంపకాల పేరుతో తన వద్ద తీసుకున్న డబ్బుల వివరాలతో ఫిర్యాదు అందించారు.