
తడిసిన ధాన్యం.. అన్నదాతల ఆందోళన
వనపర్తి: జిల్లాకేంద్రంలో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఉన్న కొనుగోలు కేంద్రాలకు విక్రయానికి తీసుకొచ్చిన ధాన్యం చాలావరకు తడిసిపోయింది. దీంతో శనివారం అన్నదాతలు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని, ధర తక్కువగా ఇస్తే.. ఒప్పుకునేది లేదంటూ సుమారు గంటన్నర పాటు రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రాస్తారోకోతో రహదారికి ఇరువైపులా వాహనాలు చాలాదూరం వరకు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రమేష్‌రెడ్డి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అకాల వర్షానికి సుమారు 5 వేల బస్తాల ధాన్యం తడిసినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రైతులకు స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు మద్దతు తెలిపి రోడ్డుపై బైఠాయించారు.