
ఎన్నాళ్లీ ఇబ్బందులు..!
● రేకుల షెడ్డులో విద్యార్థులకు తరగతులు
● మా ఊరి పాఠశాల గోడు వినరా
అంటున్న కె. పెద్దవలస గిరిజనులు
● చిన్నారుల భవిత కోసం నడుం బిగించిన గ్రామస్తులు
● రేకుల షెడ్‌కు ఎదురుగా పూరిపాక నిర్మాణం
మక్కువ: వారంతా గిరిజనులు.. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు.. వారి జీవితాల వలే పిల్లల జీవితాలు కాకూడదనే ఉద్దేశంతో విద్యార్థులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఎన్ని ప్రభుత్వాలు మారిన పాఠశాల తీరు మారకపోవడంతో ఆవేదన చెందారు. గతంలో నిర్మించిన పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో భవనాన్ని తొలగించారు. అప్పటి నుంచి గ్రామంలో పాఠశాలే లేదు. ఉపాధ్యాయులు కొన్నాళ్ల పాటు ఓ చెట్టు కింద పాఠాలు బోధించేవారు. పిల్లలు అవస్థలు చూసి తల్లిదండ్రులు, గ్రామస్తులు చలించిపోయారు. ఎంతోమంది అధికారులకు, పాలకులకు పాఠశాల దీనస్థితిని వివరించారు. అయినా సమస్యకు పరిష్కారం దొరకకపోవడంతో గ్రామస్తులంతా నడుంబిగించి, చందాలు పోగుచేసుకొని రేకులషెడ్‌ను నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఆ రేకుల షెడ్‌కు ఎదురుగా పూరిపాక నిర్మిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం కె.పెద్దవలస పాఠశాల దనస్థితిపై కథనం.
రేకుల షెడ్‌లోనే తరగతులు..
పాఠశాలలో 52 మంది విద్యార్థులు ఒకటో తరగతి నుంచి ఐదు వరకు చదువుతున్నారు. పాఠశాలకు పక్కా భవనం లేకపోవడంతో గ్రామస్తులు చందాలు వేసుకుని ఏర్పాటు చేసుకున్న రేకుల షెడ్‌లోనే తరగతులు చెబుతున్నారు. అయితే వర్షం కురిస్తే విద్యార్థులు, ఉపాధ్యాయులు తడిసిపోతున్నారు. పాఠశాలలో గతేడాది ముగ్గురు ఉపాధ్యాయులు విధులు నిర్వహించేవారు. ఈ ఏడాది పాఠశాలను మోడల్ ప్రైమరీ పాఠశాలగా ప్రభుత్వం గుర్తించడంతో, మరో లాంగ్వేజ్ పండిట్ పోస్టును మంజూరు చేశారు. దీంతో పాఠశాలలో 52 మంది విద్యార్థులతో పాటు నలుగురు ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి దాపురించింది.
పూరిపాక నిర్మాణం..
గ్రామస్తులు గతంలో నిర్మించిన రేకుల షెడ్ విద్యార్థులకు సరిపోవడం లేదు. దీంతో పూరిపాక నిర్మాణం చేయాలని నిర్ణయించుకుని, ఆదివారం సమీపంలో ఉన్న కొండకు వెళ్లి వెదురుకర్రలు, మానికర్రలు తీసుకొచ్చి పూరిపాక నిర్మాణానికి నడుం బిగించారు. అలాగే గ్రామంలో గతంలో నిర్మించిన అంగన్‌వాడీ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో దాన్ని తొలగించారు. దీంతో ఓ అద్దె ఇంటిలో చిన్నారులకు విద్యాబుద్ధులు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో అంగన్‌వాడీ భవనం కోసం పూరిపాకను నిర్మించేందుకు స్థలాన్ని గ్రామస్తులు కేటాయించుకున్నారు.
నాడు – నేడు నిధులతో పునాదులు..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర చొరవతో గ్రామంలో పాఠశాల భవనం నిర్మించేందుకు నాడు – నేడు ఫేజ్–2లో 38 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. సుమారు 10 లక్షల రూపాయలతో పునాదులు, పిల్లర్లు వేశారు. అలాగే స్పెషల్‌గ్రాంట్ నిధులు మరో 10 లక్షల రూపాయలను రాజన్నదొర మంజూరు చేయించినప్పటకీ, ఎన్నికల కోడ్ వల్ల నిధులు మంజూరుకు అంతరాయం ఏర్పడంది. దీంతో పనులు జరగలేదు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి పాఠశాలకు పక్కా భవనాలు నిర్మించాలని గ్రామ పెద్దలు కోరుతున్నారు.

ఎన్నాళ్లీ ఇబ్బందులు..!

ఎన్నాళ్లీ ఇబ్బందులు..!