
సంస్కృతీ, సంప్రదాయాలు చాటిచెప్పేలా తీర్థాలు ..
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
లక్కవరపుకోట: గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న అమ్మవారి పండగలు, తీర్థాలు, జాతరలు మన పల్లె సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేలా నిర్వహించాలని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని తలారి గ్రామంలో వైఎస్సార్‌సీపీ మండల పార్టీ అధ్యక్షుడు గుమ్మడి సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సత్యవమ్మ పేరంటాల అమ్మవారి తీర్థం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ఇటువంటి తీర్థాలు సందర్భంగా నిర్వహిస్తున్న వివిధ పోటీలు మన సాంప్రదాయ క్రీడలను గుర్తుకు తెస్తున్నాయని కొనియాడారు. ముందుగా జిల్లా స్థాయి సీనియర్, జూనియర్ విభాగాల్లో ప్రతిభ పరీక్షలు నిర్వహించారు. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. జిల్లా స్థాయి కోలాటం పోటీలు నిర్వహించి మహిళలకు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం రాష్ట్ర స్థాయి గుర్రాలు, ఎడ్లు పరుగు పందెం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 20 గుర్రాలు, 12 జతల ఎడ్ల బళ్లు పాల్గొన్నాయి. విజేతలకు జెడ్పీ చైర్మన్ నగదు బహుమతులు అందజేశారు. ఈ పోటీలకు రిఫరీగా డీసీసీబీ మాజీ చైర్మన్ వేచలపు చిన్నరామునాయుడు వ్యవహరించారు. వేల మందికి అన్న సమారాధాన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ శ్రీనురాజు, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ డైరెక్టర్లు వాకాడ రాంబాబు, గుమ్మడి స్వాతికుమారి పాల్గొన్నారు.