
అర్జీలు వింటున్న జేసీ మయూర్ అశోక్
● స్పందనకు 257 వినతులు
విజయనగరం అర్బన్: ప్రజల నుంచి వినతులను స్వీకరించడానికి కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే జనగన్నకు చెబుదాం కార్యక్రమానికి ఈ వారం సర్వర్ సమస్య ఇబ్బంది పెట్టింది. కార్యక్రమానికి వచ్చిన వినతులను జిల్లా వ్యాప్తంగా ఉన్న సచివాలయాలతో లింక్ చేసి నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే సోమవారం దాదాపు రెండు గంటలపాటు ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చిన ప్రజలు క్యూలో నిరీక్షించాల్సి వచ్చింది. జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారిణి ఎస్.డి.అనిత, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, సుదర్శన దొర, సమబాల, జిల్లా అధికారులు వినతులను స్వీకరించారు. స్పందనకు వచ్చిన 257 వినతుల్లో అత్యధికంగా రెవెన్యూకు సంబంధించి 203 ఉన్నాయి. మిగిలిని వాటిలో గ్రామ సచివాలయాల శాఖ 19, డీఆర్‌డీఏ 9, జిల్లా సంచాయతీ అధికారివి 4, హౌసింగ్ 10, మున్సిపల్‌కి 3, డీసీహెచ్‌ఎస్‌కు 3 మిగిలినవి ఇరత శాఖలకు చెందినవిగా ఉన్నాయి. వినతులను సకాలంలో పరిష్కరించాలని జేసీ మయూర్ అశోక్ జిల్లా అధికారులను ఆదేశించారు.
ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం
విజయనగరం క్రైమ్: స్పందన కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల పట్ల స్పందించి బాధితులకు సత్వరన్యాయమందించాలని ఎస్పీ ఎం.దీపిక అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 45 ఫిర్యాదులను ఆమె స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, దిశ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ ఈ.నరసింహమూర్తి, డీసీఆర్‌బీ ఎస్సైలు వాసుదేవ్, ప్రభావతి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
వినతులను పూర్తిస్థాయిలో పరిష్కరించాలి
పార్వతీపురం: జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే వినతులను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌లోని సమావేశ మందిరంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్‌తో పాటు ఐటీడీఏ పీఓ సి.విష్ణు చరణ్‌లు ప్రజల నుంచి వ్యక్తిగత, సామాజిక అంశాలపై 170 అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో సీడీపీఓ ఎంఎన్.రాణి, లీడ్ బ్యాంక్ మేనేజర్ జేఎల్‌ఎన్. మూర్తి, రవాణాశాఖాధికారి మల్లికార్జున రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ డీడీ కె.శ్రీనివాసరావు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, మున్సిపల్ కమిషనర్ జేఆర్. అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదులపై సత్వర న్యాయం
పార్వతీపురంటౌన్: ఫిర్యాదులపై సత్వర న్యాయం జరగాలని పార్వతీపురం మన్యం జిల్లా అదనపు ఎస్పీ దిలీప్ కిరణ్‌అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన నేరుగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన పోలీస్ అధికారులతో మాట్లాడుతూ స్పందనలో ఫిర్యాదు చేసిన వ్యక్తి పదే పదే పోలీసుస్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని, బాధితులకు చట్ట పరిధిలో తక్షణమే న్యాయం అందించేలా చర్యలు తీసుకుని చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌బీ సీఐ సీహెచ్ లక్ష్మణ రావు, డీసీఆర్‌బీ సీఐ ఎన్.వి. ప్రభాకర్ రావు, ఎస్సై పాపారావు, సిబ్బంది పాల్గొన్నారు.

ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎస్పీ ఎం.దీపిక

పార్వతీపురం టౌన్: బాధితుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న అదనపు ఎస్పీ దిలీప్‌కిరణ్

పార్వతీపురం: వినతులను స్వీకరిస్తున్న జేసీ గోవిందరావు