రేషన్‌కు ఈకేవైసీ గండం | - | Sakshi
Sakshi News home page

రేషన్‌కు ఈకేవైసీ గండం

Apr 3 2025 12:41 AM | Updated on Apr 3 2025 12:41 AM

రేషన్‌కు ఈకేవైసీ గండం

రేషన్‌కు ఈకేవైసీ గండం

● ఈ నెల 30 వరకు గడువు పెంపు ● పూర్తికాకుంటే రేషన్‌తో పాటు సంక్షేమ పథకాలు కట్‌

మహారాణిపేట: సంక్షేమ పథకాలను అమలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్న కూటమి ప్రభుత్వం.. ఉన్న వాటిని తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా పేదలపై ఎలక్ట్రానిక్‌ నో యువర్‌ కస్టమర్‌(ఈకేవైసీ) అస్త్రాన్ని సంధించింది. ఈనెల 30వ తేదీలోగా రేషన్‌ కార్డుదారుల్లో వేలిముద్రల ప్రక్రియ పూర్తి చేయాలని హుకుం జారీ చేసింది. ఈ ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడం వెనుక రేషన్‌లో కోత విధించాలనే దురుద్దేశం ఉందనే విషయం తేటతెల్లమవుతోంది. రైస్‌ కార్డు ఈ–కేవైసీ చేయించుకోనివారికి వచ్చే నెల రేషన్‌తో పాటు ఇతర సంక్షేమ పథకాల్లో కోత విధించే అవకాశం ఉందని ప్రచారం విస్తృతంగా సాగుతోంది.

మందకొడిగా..

రేషన్‌ కార్డులో ఈకేవైసీ నమోదు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈకేవైసీ లేకపోతే సరుకులు కట్‌ అవుతాయని ప్రచారం వల్ల పిల్లలు, పెద్దలు, వృద్ధులు, వేలిముద్రలు పడని వారు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. సచివాలయాలు, మీసేవ, ఆధార్‌ నమోదు కేంద్రాల వద్ద ప్రజలు తాకిడి ఎక్కువైంది. మరోపక్క సర్వర్‌ సమస్య వల్ల మందకొడిగా ఈకేవైసీ జరుగుతున్నది. జిల్లాలో మొత్తం 5,12,619 కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల్లో ఉన్న 15,91,448 మంది సభ్యులకు గాను మార్చి 31వ తేదీ నాటికి 14,42,063 మంది సభ్యుల ఈకేవైసీ పూర్తయింది. ఇంకా 1,49,385 మంది సభ్యుల ఈకేవైసీ పూర్తి కావల్సి ఉంది.

అదనపు వసూళ్లు

ఈకేవైసీ పేరిట కొంత మంది వసూళ్లకు పాల్పడుతున్నారు. రేషన్‌, ఇతర సంక్షేమ పథకాలు ఈకేవైసీతో ముడిపెట్టడంతో కొంతమంది దండుకుంటున్నారు. రేషన్‌ డీలర్లు, గ్యాస్‌ డీలర్ల పేరిట ఈకేవైసీ చేస్తామని కార్డుదారులకు ఫోన్లు చేస్తున్నారు. తాము మీకు దగ్గరలో ఉన్నామని, రేషన్‌కార్డు, ఆధార్‌ కార్డు పట్టుకొని రావాలని, అలాగే వచ్చేటప్పుడు డబ్బులు కూడా తెచ్చుకోవాలని ఫోన్‌లో చెబుతున్నారు. దీంతో ఉచితంగా చేయాల్సిన ఈకేవైసీ కోసం ప్రజలు డబ్బులు తీసుకొని పరుగులు పెడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న చిరు ఉద్యోగులు, కూలీ పనులకు వెళ్లినవారు ఇంటిబాట పడుతున్నారు.

గ్యాస్‌ సబ్సిడీకి కూడా..

గ్యాస్‌ సబ్సిడీకి కూడా ఈకేవైసీ అడ్డంగా నిలిచింది. రేషన్‌ కార్డుదారులకు సర్కార్‌ ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తోంది. తొలి విడతగా మార్చి 31వ తేదీలోగా జిల్లాలో అన్ని కేటగిరిల్లో 93,784 మంది గ్యాస్‌ సిలిండర్ల కోసం బుక్‌ చేసుకోగా ఇంకా కొంత మందికి ఈకేవైసీ కాకపోవడం, ఇతర సాంకేతిక సమస్యల వల్ల సబ్సిడీ డబ్బులు పడలేదు. జిల్లాలో 8,90,345 మంది గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా.. ఇందులో తెల్లరేషన్‌ కార్డు కలిగినవారు 5,12,619 మంది ఉన్నారు.

రేషన్‌ డిపోల్లో ఏర్పాట్లు చేశాం

రేషన్‌కార్డుల్లో ఉన్న సభ్యులంతా ఈనెల 30వ తేదీలోగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ప్రతి రేషన్‌ డిపోలో ఇందుకు ఏర్పాట్లు చేశాం. 5 సంవత్సరాల లోపు.. 80 సంవత్సరాల దాటిన వాళ్లకు ఈకేవైసీ అవసరం లేదు. 6 నుంచి 60 సంవత్సరాలలోపు గల కార్డు సభ్యులు రేషన్‌ డీలర్‌ వద్ద నమోదు చేసుకోవాలి. డీలర్‌ అందుబాటులో లేకపోతే సచివాలయ వీఆర్‌వో లేదా తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్‌వోని సంప్రదించాలి. సమీపంలోని ఏఎస్‌వో కార్యాలయంలోనూ సంప్రదించవచ్చు.

– కల్యాణి, ఇన్‌చార్జి, డీఎస్‌వో, విశాఖ జిల్లా

జిల్లాలో

రేషన్‌ కార్డుల్లో సభ్యులు

15,91,448

ఈ కేవైసీ పూర్తయినవారు

14,26,463

ఇంకా చేయించుకోని వారు

1,49,385

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement