తొలి రోజు 4,288 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు | Sakshi
Sakshi News home page

తొలి రోజు 4,288 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు

Published Mon, May 6 2024 4:25 AM

తొలి రోజు 4,288 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు

ఏయూక్యాంపస్‌/మహారాణిపేట: ఏయూ తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ తొలి రోజు ఆదివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో ఎన్నికల నిర్వహణలో జిల్లా ఉద్యోగులు 13,076 మంది, ఇతర జిల్లాల ఉద్యోగులు 5,389 మంది (మొత్తం 18,465) ఉన్నారు. వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు కల్పించారు. తొలి రోజు జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు 3,152 మంది(24.1శాతం), ఇతర జిల్లాల ఉద్యోగులు 1,136 మంది(21.1శాతం) కలిపి మొత్తం 4,288 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున ఎన్నికల ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఈ నెల 8వ తేదీ వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ కొనసాగుతుందని చెప్పారు.

7, 8 తేదీల్లో హోం ఓటింగ్‌ : ఈ నెల 7, 8 తేదీల్లో హోం ఓటింగ్‌ కార్యక్రమం జరుగుతుందని, ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని ఎన్నికల అధికారి మల్లికార్జున తెలిపారు. ఆ రెండు రోజు ల్లో ఓటు హక్కు వినియోగించుకోలేక పోయిన వారికి 9వ తేదీన ప్రత్యేక అవకాశం కల్పిస్తామన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 80 శాతం ఓటు హక్కును వినియోగించుకునేలా స్వీప్‌ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని 1,991 పోలింగ్‌ కేంద్రాల్లో 502 క్లిష్టమైన కేంద్రాలను గుర్తించి, ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. అన్ని చోట్ల వెబ్‌ కాస్టింగ్‌, సూక్ష్మ పరిశీలకులు, వీడియోగ్రాఫర్లను నియమించామని తెలిపారు. సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగుల కోసం ఏర్పాట్లు చేశారు.

Advertisement
Advertisement