
చేతి వృత్తిని వ్యాపారం చేస్తే ఊరుకోం
అనంతగిరి: కార్పొరేట్ సెలూన్లకు తావివ్వకుండా ప్రభుత్వ పెద్దలు, అధికారులు చొరవ తీసుకొని నాయీ బ్రాహ్మణులు సంక్షేమానికి కృషి చేయాలని ఆ విభాగం నేతలు, విశ్రాంత ప్రొఫెసర్ ఎం.భాగయ్య కోరారు. మంగళవారం వికారాబాద్ కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్‌ను కలిసి ఈ మేరకు విన్నవించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నిజాం కాలంలో 12 కులాలకు ఇనామ్ భూములు ఇవ్వడం జరిగిందని, ఈ కులాల వారు వృత్తి ధర్మాన్ని నెరవేర్చే సేవకులని గుర్తు చేశారు. ముఖ్యంగా నాయీ బ్రాహ్మణులకు 5 వృత్తి ధర్మాలు ఉన్నాయని, అందులో ఒకటి క్షౌ రము, మంగళ వాయిద్యం, వైద్యము, మంత్రసాని, (కాగడా) దివిటీ. ఉదయం లేచిన కాడి నుంచి అన్ని ముఖ్య దేవాలయాల్లో మేలుకొలుపు నుంచి దివిటీ పట్టే వరకు నాయీ బ్రాహ్మణుల వృత్తి అని పేర్కొన్నారు. 1982లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఫెడరేషన్లుగా సాధించుకోవడంతో పాటు కులవృత్తికి సంబంధించిన సామగ్రిని కూడా పొందడం జరిగిందన్నారు. ఇతర మతాలకు చెందిన కొందరు వచ్చి సెలూన్లు పెట్టుకొని నాయీ బ్రాహ్మణుల వృత్తి దోచేద్దామని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేమన్నారు. న్యాయం కోసం హై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగి సీపీ రెడ్డి, సంఘం సభ్యులు శేఖర్, రఘుపతి, రమేష్, భగవాన్, నాగరాజు, నరేష్, సంతోష్, రాజు, నర్సింలు, ఎం.నరేష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
అన్య మతస్తులు కార్పొరేట్ సెలూన్లు పెట్టడానికి వీల్లేదు
నాయీ బ్రాహ్మణుల సంక్షేమ విభాగం నేతలు, విశ్రాంత ప్రొఫెసర్ బాగయ్య
అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత