
ఆర్టీసీని రక్షించుకుంటాం
హయత్‌నగర్: ఆర్టీసీని రక్షించుకుంటామని, సంస్థను లాభాల్లోకి తీసుకొస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్టు మండలంలోని మునుగనూరులో మంగళవారం ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల కమ్యూనిటీ హాలు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదవాడికి రవాణా సౌక ర్యం కల్పించేది ఆర్టీసీ బస్సు మాత్రమేనని అలాంటి బస్సులను నడిపి సేవలు అందిస్తున్న కార్మికులను గుండెల్లో పెట్టుకుంటామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూ సిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త బస్సులు కొంటున్నామని, పీఆర్‌సీ ఇచ్చామని, కారుణ్య నియమకాలు చేపట్టామని, కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తున్నామని వివరించారు. కార్మికుల సంక్షేమం, సంస్థ పరిరక్షణ, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో ఆర్టీసీ పురోగమిస్తోందని అన్నారు. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పును మిగిల్చిన గత ప్రభుత్వం ఆర్టీసీని దివాలా తీయించిందని విమర్శించారు. కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించి వారికి అండగా ఉంటామన్నారు. రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీ మేరకు విశ్రాంత కార్మికుల భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముద్దగోని లక్ష్మీప్రసన్న, ఆర్డీఓ అనంతరెడ్డి, తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, విశ్రాంత కార్మిక సంఘం అధ్యక్షుడు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
కార్మికులను గుండెల్లో పెట్టుకుంటాం
మంత్రి పొన్నం ప్రభాకర్