
రెవె‘న్యూ’ సేవలు
బొంరాస్‌పేట: ప్రజలకు మెరుగైన, సత్వర సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రెవెన్యూ సేవలను మరింత సులభతరం చేసింది. మీసేవ కేంద్రాల ద్వారా కులం, ఆదాయం, మార్కెట్ వ్యాల్యూ ధ్రువీకరణ పత్రాలు మరింత సులువుగా అందించే కొత్త వెసులుబాటు అమలులోకి వచ్చింది. మీసేవలో దరఖాస్తు చేసుకుంటే చాలు ఇంటి వద్దకే ఇసుక వచ్చే అవకాశం ఏర్పడింది. ఈ అవకాశాలు ఈ నెల 27 నుంచి అమలులోకి వచ్చాయి. దీంతో అర్జీదారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సత్వర సేవలు
రెండు రోజుల క్రితం వరకు కుల ధ్రవీకరణ పత్రం కావాలంటే నిర్దిష్ట సమయం 30రోజులు పట్టేది. కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవ కేంద్రాలు, తహసీల్దారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేంది. పత్రాలు సకాలంలో అందక సామాన్యులు కొన్ని పథకాలకు దూరమయ్యే వారు. విద్యార్థులు ప్రవేశాలు పొందక, యువత ఉద్యోగాలు చేజార్చుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. అలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీసేవల్లో ఈ కొత్త విధానం అమలులోకి తెచ్చింది. ఇప్పటి నుంచి నిమిషంలోనే కుల ధ్రువీకరణ పత్రం అందనుంది. అందుకోసం అర్జీదారులు సమీపంలోని మీసేవ కేంద్రంలో తమ పాత పత్రం నంబరు లేదా ఆధార్‌కార్డు నంబరు చెప్పాలి. ఓటీపీ నంబరుతో వెంటనే ధ్రువీకరణ పత్రం అందుతుంది.
వాల్యూ సర్టిఫికెట్లు కూడా..
అలాగే రిజిస్ట్రేషన్ శాఖ అందించే మార్కెట్ వ్యాల్యూ సర్టిఫికెట్లు సైతం ఈ విధానంతోనే అందే వెసులుబాటు కల్పించింది. ఇదివరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండేది. కొత్త విధానం అమలులోకి రావడంతో ఇక నుంచి రాష్ట్రంలో ఎక్కడినుంచైనా మీసేవ కేంద్రాల్లో పొందే అవకాశం లభించనుంది.
ఇంటి వద్దకే ఇసుక
ఇసుక అవసరమైన వారు సమీపంలోని మీసేవలో బుక్‌చేస్తే చాలు కావాల్సినంత ఇసుక అధికారికంగా ఇంటి వద్దకే వస్తుంది. మీసేవ కేంద్రంలో తమ మొబైల్ నంబరుతో రిజిస్టర్ చేసుకోవాలి. ఇసుక రవాణా చేసే వాహనం రకం, వాహనం నంబరు, ఇసుక పరిమాణం, ఎక్కడికి కావాలో, ఏ తేదీన కావాలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ఆన్‌లైన్ వివరాల నమోదు, రుసుం చెల్లింపులు అనంతరం ఇంటికి వద్దకే ఇసుక అందించే అధికారిక ప్రక్రియ కల్పించారు. తహసీల్దారు ధ్రువీకరణతో అర్జీదారుల ఇళ్ల వద్దకు సులభంగా ఇసుక అందుతుంది. అక్రమాలకు అడ్డుకట్టవేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కొత్త విధానం అమలులోకి తెచ్చినట్లు తెలిసింది.
అమలులోకి వచ్చిన నూతన సేవలు
మీసేవ కేంద్రాల్లో అందుబాటులోకి..
దరఖాస్తు చేసిన వెంటనే కులం, ఆదాయ ధ్రువపత్రాలు
ఇక నుంచి ఇంటి వద్దకే ఇసుక
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
జిల్లాలోని మున్సిపాలిటీలు – 4
మొత్తం మండలాలు – 32
మీసేవా కేంద్రాలు – 84