
బాధ్యత మీది.. బరువు మాది!
కడుపున పుట్టిన వారికి ఇసుమంత కష్టం వచ్చినా తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. అరచేతిలో పెట్టుకుని పెంచుకున్న బిడ్డలకు కాసింత ఇబ్బంది కూడా కలగకుండా కళ్లలో పెట్టుకుని కాపాడుకుంటారు. ఏడాది పొడవునా చదువులమ్మ ఒడిలో నిరంతరం శ్రమించే పిల్లలతో చిన్నపాటి బరువును కూడా మోపకుండా బాధ్యతలను నెత్తికెత్తుకుంటారు. సోమవారం తిరుపతిలోని పలు విద్యాసంస్థల ఎదుట ఇదే దృశ్యం కనిపించింది. జన్మనిచ్చిన వారి మమకారం ఎలా ఉంటుందో కళ్లెదుట సాక్షాత్కరించింది. టీటీడీ కాలేజీలు.. ఎస్వీయూ.. మహిళా వర్సిటీ పరిధిలోని కళాశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులను వదిలిపెట్టేందుకు తల్లిదండ్రులు తరలివచ్చారు. ఆయా హాస్టళ్ల వరకు లగేజీలను తీసుకు వచ్చి పిల్లలకు అందించారు. బ్యాగులు.. పెట్టెల బరువును పంచుకునేందుకు బిడ్డలు ముందుకు వచ్చినా.. మీరు ఇష్టపడి చదువుకోండి.. మేం సంతోషంగా కష్టపడతాం అంటూ ప్రేమాభిమానాలు చాటుకున్నారు. బాధ్యతగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే వేసవి సెలవుల కారణంగా బోసిబోయిన కాలేజీలు విద్యార్థులతో కళకళలాడాయి. దాదాపు 45 రోజుల విరామం తర్వాత కనిపించిన స్నేహితులతో కబుర్లు ఎల్లలు దాటాయి. పరస్పరం యోగక్షేమాలను తెలుసుకుని అందరి మనసులు ఆనందంతో నిండిపోయాయి. – తిరుపతి సిటీ

బాధ్యత మీది.. బరువు మాది!

బాధ్యత మీది.. బరువు మాది!

బాధ్యత మీది.. బరువు మాది!