
సమస్యల వెంబడి వినతులు
తిరుపతి అర్బన్ : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)కు వినతులు వెల్లువెత్తాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టర్, జేసీ తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని ఆదేశించారు. గ్రీవెన్స్‌కు వివిధ సమస్యలపై మొత్తం 307 వినతులు వచ్చినట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు.
మా బడి.. మా ఊరిలోనే..
పుత్తూరు మండలం నేసనూరు వడ్డిపాళెం వాసులు తమ గ్రామంలోని బడిని కొనసాగించాలని కోరారు. తమ ఊరిలో 100 కుటుంబాలు ఉన్నాయని, 1 నుంచి 5వ తరగతి వరకు 30 మంది పిల్లలు ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నారని తెలిపారు. అయితే క్లస్టర్ పేరుతో ప్రభుత్వం మా బడిలోని 3,4,5 తరగతులను నేసనూరులోని ప్రాథమిక పాఠశాలకు మార్పు చేశారని వాపోయారు. వడ్డిపాళెం నుంచి ఆ గ్రామంలోని స్కూల్‌కు వెళ్లేందుకు 2.5 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలోని పాఠశాలకు పక్కా భవనం కూడా నిర్మించారని, నాడు–నేడు కింద సకల వసతులు ఉన్నాయని వెల్లడించారు. అయితే కూటమి ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. మా ఊరిలోని బడిని ఇక్కడే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కలెక్టర్, డీఈఓకు వినతిపత్రాలు సమర్పించారు.

సమస్యల వెంబడి వినతులు