
మరణంలోనూ వీడని స్నేహం
– చుక్కలనిడిగల్లులో విషాదం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి మండలం చుక్కలనిడిగల్లు గత నాలుగు రోజులుగా శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామానికి చెందిన స్నేహితులు మురళీకృష్ణ(20), ఽప్రశాంత్(20) మృతి చెందడం తీవ్ర విషాదం మిగిల్చింది. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి పెరిమిడి మురళికృష్ణ మృతి చెందాడు. మిత్రుడు గల్లంతవడం చూసిన ప్రశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో స్నేహితుడు బలవన్మరణానికి యత్నించాడు. వివరాలు.. కాకినాడ ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి కళాశాలలోనే నంబర్‌వన్‌గా రాణిస్తున్న పెరిమిడి మురళీకృష్ణ వేసవి సెలవుల నేపథ్యంలో గ్రామానికి వచ్చాడు. చిన్నప్పటి నుంచి ఒక జట్టుగా ఉండే ధనుష్, మురళీకృష్ణను కలుసుకున్నాడు. వారి స్నేహం అపురూపంగా ఉండేది. మురళీకృష్ణ చదువులో మంచి ప్రతిభను కనబరిస్తే, మిగిలిన ఇద్దరూ చిన్నచిన్న పనులు చేసుకునేవారు. ఈ క్రమంలో గురువారం తొట్టంబేడు మండలంలోని ఓ స్నేహితుని కలిసేందుకు వీరు ముగ్గురూ వెళుతూ మార్గం మధ్యలో తెలుగుగంగ కాలువలో ఈత కొట్టేందుకు దిగారు. ప్రవాహ ఽఉధృతికి మురళీకృష్ణ కొట్టుకుపోయాడు. దీనిపై మురళీకృష్ణ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టి 13వ తేదీ సాయంత్రం మురళీకృష్ణ మృతదేహాన్ని వెలికితీశారు. స్నేహితుడి మరణాన్ని జీర్ణించుకోలేని ప్రశాంత్ పురుగుల మందు తాగేశాడు. తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం మరణించాడు. ఇద్దరు మిత్రులు కన్నుమూయడంతో ఆవేదన తట్టుకోలేక ధనుష్ సైతం శానిటైజర్ తాగేశాడు. అయితే వెంటనే వైద్యసేవలందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

మరణంలోనూ వీడని స్నేహం