
చంద్రగిరి:పూతలపట్టు– నాయుడుపేట జాతీయ రహదారిపై అగరాల సమీపంలో సోమవారం ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. అగరాల పంచాయతీ వినాయక నగర్‌కు చెందిన కేశవులు(55) బహిర్భూమికి వెళ్లేందుకు జాతీయ రహదారి దాటుతుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విశ్వంలో అవగాహన సదస్సు రేపు
తిరుపతి ఎడ్యుకేషన్:తిరుపతి వరదరాజనగర్‌లో ని విశ్వం విద్యాసంస్థలో బుధవారం ఉద యం 10గంటలకు సైనిక్, నవోదయ, మిలిటరీ పాఠశాలల్లో ప్రవేశ పరీక్షలపై ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. సోమవారం ఈ మేరకు విద్యాసంస్థ అధినేత డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ అవగాహన సదస్సుకు 4 నుంచి 9వ తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొనవచ్చని తెలిపారు. వివరాలకు 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
తిరుపతి : తిరుపతి నగరంలోని ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. వీఆర్‌ఎల్ ట్రాన్స్‌పోర్టుకు చెందిన లారీ అన్‌లోడింగ్ పూర్తయిన తర్వాత పార్కింగ్ చేస్తుండగా వాహనం పై భాగంగా విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో కరెంట్ షాక్ తగిలి ఐరాల మండలం మద్దిపట్టవారిపల్లెకు చెందిన లారీ డ్రైవర్ ఈశ్వర్(50) అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు.