
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ
భర్తను, కూతురును హత్య చేసిన మహిళ
అనారోగ్యంతో భర్త చనిపోయాడని, కూతురు కనిపించడం లేదని నమ్మించిన వైనం
కేసును ఛేదించిన కాటారం పోలీసులు
భూపాలపల్లి అర్బన్: ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ.. భర్తను, కుమార్తెను మూడు నెలల వ్యవధిలో హతమార్చింది. అనారోగ్యంతో భర్త చనిపోయాడని, కూతురు కనిపించడం లేదని నమ్మించింది. పోలీసులు ఆరా తీయగా ఆ మహి ళ బాగోతం బయటపడింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితల గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్పీ కిరణ్‌ఖరే బుధవారం ఈ కేసు వివరాలు వెల్లడించారు.
ఆగస్టు 28న కాటారం పోలీస్‌స్టేష న్ పరిధిలోని జాతీయ రహదారి పక్కన యువతి మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచా రం వచ్చింది. కాటారం ఎస్సై, సీఐ, డీఎస్పీలు ఘట నా స్థలాన్ని పరిశీలించి మృతదేహం చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన కప్పుల వర్షిణి (22)గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఆగస్టు 3వ తేదీనుంచి వర్షిణి కనిపించడం లేదని ఆమె తల్లి కవిత అదే నెల 6న చిట్యాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో కవితపై అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణ జరిపి తల్లి కవితనే సూత్రధారిగా గుర్తించారు. ఈ నెల 2వ తేదీన కవిత, ఆమె ప్రియుడు రాజ్‌కుమార్ కాటారం సీఐ నాగార్జునరావుకు పట్టుబడ్డారు. విచారణలో విస్తుపోయే విషయా లు బయటికి వచ్చాయి.
మూడు నెలలక్రితం భర్తను..
కుమారస్వామి మొదటి భార్య చనిపోవడంతో మల్హర్ మండలం కొయ్యూరుకు చెందిన కవితను 24 ఏళ్లక్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇరువురు కుమార్తెలు కాగా చిన్న కూ తు రు ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంది. పెద్ద కూతురు ఇంటి వద్దే ఉంటోంది. కుమారస్వామికి పక్షవాతం రాగా ఐదేళ్లుగా మంచంపైనే ఉంటున్నాడు. ఈ క్రమంలో కవిత అదే గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విష యంపై ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే భర్తను చంపాలని నిర్ణయించుకున్న కవిత.. తన ప్రియుడుతో కలిసి జూన్ 25న మంచంలో పడుకున్న కుమారస్వామిని గొంతు నులిమి హత్య చేశారు. అనారోగ్యంతో చనిపోయాడని చిత్రీకరించారు. ఈ విషయం కూతురు వర్షిణికి తెలియడంతో ఆమెను కూడా హత్య చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 3న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వర్షిణిని కవిత, రాజ్‌కుమార్ కలిసి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు.
మృతదేహాన్ని సంచిలో వేసి ఇంటి వెనకాల చెట్ల పొదల్లో దాచిపెట్టి మరుసటి రోజు గ్రామ శివారులోని పొదల్లో పడేశారు. మృతదేహం దుర్వాసన వస్తుండటంతో 25వ తేదీన కాటారం వైపునకు తీసుకువచ్చి అడవిలో పడేసి వెళ్లాడు. పోలీసుల దృష్టి మళ్లించేందుకు యూట్యూబ్‌లో చూసి అడవిలో క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లు వదిలివెళ్లారు. కాగా, విచారణలో రెండు హత్యలు చేసినట్లు కవిత, రాజ్‌కుమార్‌లు ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు.