దిగుబడి కష్టమే..
మిర్చి పంటపై
తెగుళ్ల దండయాత్ర
భూపాలపల్లి రూరల్: జిల్లాలో మిర్చి పంట సాగు చేస్తున్న రైతుల పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. గతేడాది తెగుళ్ల బెడతతో దిగుబడి తగ్గి ఇబ్బందులు పడగా.. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. పంటకు నల్లతామర, పండుతెగులు, ఆకుముడత, ఎండు తెగుళ్లు వ్యాప్తి చెందడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు ఇప్పటికే సుమారు రూ.1లక్ష పెట్టుబడి పెట్టిన రైతులు దిగుబడిపై దిగులు చెందుతున్నారు. జిల్లాలో గతేడాది 19,635 ఎకరాల్లో మిర్చి సాగు చేయగా తెగుళ్లు సోకి దిగుబడి రాక రైతులు నష్టపోయారు. దీంతో ఈ ఏడాది 9,521 ఎకరాల్లో సాగు చేసినట్లు అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి. 2251 వండర్‌హాట్, తేజ 341531 రకాలను ఎక్కువగా సాగు చేశారు. మిర్చికి ప్రతీ ఏడాది ఆశించే నల్లతామరతోపాటు ఈ ఏడాది అదనంగా పండు తెగులు, ఆకుముడత, ఎండుతెగులు, వేరుకుళ్లు వ్యాప్తిచెందుతుంది. ఇప్పటికే జిల్లాలో రేగొండ, చిట్యాల, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో తెగుళ్ల బెడదను అధికారులు గుర్తించారు.
దిగుబడిపై దిగులు..
జిల్లాలో బోర్లు, బావుల కింద నల్లరేగడి భూముల్లో వర్షాధారం కింద మిర్చి పంటను సాగు చేస్తున్నారు. ఎకరాకు సాధారణ దిగుబడి 15 నుంచి 18 కింటాళ్లు రావాల్సి ఉండగా తెగుళ్ల కారణంగా 10 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఇప్పుడు కూడా తెగుళ్లు పంటను ఆశించడంతో రైతులు దిగుబడి ఎంత వస్తుందని ఆందోళన చెందుతున్నారు. గతేడాది క్వింటా ధర రూ.11 వేలు పలికింది, ఈసారి జిల్లాలో మిర్చి సాగు సగానికి తగ్గింది. ధర ఎలా ఉంటుందోనని రైతులు మదనపడుతున్నారు.
నివారణకు పురుగు మందుల పిచికారీ చేస్తున్న రైతులు
పెరుగుతున్న పెట్టుబడి
జిల్లాలో 9,521 ఎకరాల్లో మిర్చి సాగు
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు భూపాలపల్లి మండలం గండ్రపల్లికి చెందిన బట్టు శ్రీను. రెండెకరాల్లో దొడ్డు (నగరం) మిర్చి రకం సాగు చేశాడు. తోటకు ఆకుముడత నివారణకు పురుగుల మందు పిచికారీ చేస్తున్నాడు. అయినా నయం కావడం లేదు. పెట్టుబడి ఇప్పటికే ఎకరానికి రూ.1లక్షకు పైగా పెట్టాడు. తోటలోని మొక్కలు పండు పండుతున్నాయి. చివరికి తెగుళ్లతో పంట చేతికి వస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నాడు. ఇలా జిల్లా వ్యాప్తంగా మిర్చి పంట సాగు చేస్తున్న రైతుల పరిస్థితి ఇలాగే ఉంది.
దిగుబడి కష్టమే..
దిగుబడి కష్టమే..


