కొట్లాడుడు.. కొనుడు..

TRS Govt Focus On Yasangi Grain purchase - Sakshi

అటు కేంద్రంపై పోరు.. ఇటు ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

రైతులకు అండగా ఉండేది రాష్ట్ర సర్కారే అనిపించేలా వ్యూహం!

కేంద్ర ప్రభుత్వమే ధాన్యం కొనాలంటూ 11న ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ధర్నా

ఆ తర్వాత ధాన్యం కొనుగోళ్లపై సీఎం ప్రకటన చేసే చాన్స్‌

రాష్ట్రంలో ఇప్పటికే వరి కోతలు మొదలు

దళారులు, మిల్లర్లకు ధాన్యం విక్రయిస్తున్న రైతులు

మద్దతుధర కన్నా నాలుగైదు వందలు తక్కువకే అమ్ముకుంటున్న తీరు.. నిజామాబాద్‌ జిల్లా వర్నిలో ఇప్పటికే 25 శాతం పంట విక్రయం

కొనుగోళ్లు ఉంటాయని, తొందరపడవద్దని రైతులకు చెప్తున్న ఎమ్మెల్యేలు

సర్కారు ఆలోచన ఇదీ..: రాష్ట్ర రైతులు ప్రస్తుత యాసంగిలో 35 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. యాసంగి ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనబోమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గట్టిగా స్పష్టం చేసింది. ఈ క్రమంలో ధాన్యం కొనాల్సిందేనంటూ సీఎం కేసీఆర్, మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ నెల 11న ఢిల్లీలో వరి దీక్ష కూడా తలపెట్టారు. అయినా కేంద్రం దిగిరాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకమంటూ ఎత్తిచూపడం, బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాలన్నింటినీ తిప్పికొట్టడంతోపాటు రైతులకు అండగా నిలిచేది రాష్ట్ర ప్రభుత్వమేనన్న సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లవచ్చని భావిస్తున్నట్టు సమాచారం. 

సాక్షి, హైదరాబాద్‌:  యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రాన్ని దోషిగా నిలబెట్టడం.. రైతులకు అండగా నిలిచేది రాష్ట్ర ప్రభుత్వమే అన్న సందేశాన్ని జనంలోకి పంపడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ సర్కారు అడుగులు వేస్తోంది. అటు కేంద్రంపై పోరును కొనసాగిస్తూనే.. ఇటు రాష్ట్ర రైతులు యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. కొన్ని జిల్లాల్లో వరికోతలు ఇప్పటికే మొదలై ప్రైవేటు విక్రయాలు సాగుతున్నాయి. ఈనెల మూడో వారం నుంచి వరి కోతలు ఊపందుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 11న ధర్నా అనంతరం ధాన్యం కొనుగోళ్లపై కీలక ప్రకటన చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. 

మొదలైన వరి కోతలు 
యాసంగి వరిని బాయిల్డ్‌ రైస్‌ చేస్తే తీసుకోబోమని కేంద్రం గతంలోనే ప్రకటించింది. అయితే రాష్ట్రంలో యాసంగి ధాన్యం బాయిల్డ్‌ రైస్‌గా మాత్రమే పనికొస్తుందని.. ముడి బియ్యం (రా రైస్‌)గా మారిస్తే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ధాన్యం కొనాలని ఓ వైపు కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే.. వరిసాగు చేయవద్దని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోమని రాష్ట్ర రైతాంగానికి స్పష్టం చేసింది. అయినా రాష్ట్రంలో రైతులు 36 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈసారి వాతావరణం బాగుండటంతో దిగుబడి కూడా బాగానే వస్తుందని వ్యవసాయ శాఖ చెప్తోంది. ముందుగా నాట్లు వేసిన నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి వంటిచోట్ల ఇప్పటికే వరి కోతలు మొదలయ్యాయి. నిజామాబాద్‌ జిల్లా వర్ని పరిధిలోని నాలుగైదు గ్రామాల్లో 25 శాతం పంటను కోయడం, ప్రైవేటుగా విక్రయించడం కూడా జరిగింది. ఈ నెల 3వ వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ఊపందుకోనున్నాయి. 

మిల్లర్లు, దళారుల మాయాజాలం షురూ.. 
కొనుగోళ్లపై స్పష్టత రాకపోవడంతో వరి కోతలు పూర్తయిన ప్రాంతాల్లో ధాన్యం విక్రయాలపై గందరగోళం నెలకొంది. దళారులు, మిల్లర్లు మద్దతు ధరకన్నా రూ.500 వరకు తక్కువ ఇస్తున్నారు. తరుగు, తేమ అంటూ క్వింటాల్‌కు రూ.1,400 నుంచి రూ.1,500 వరకే ఇస్తున్నట్టు రైతులు చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడుతూ ‘‘తొందరపడి తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దు. ఢిల్లీ ధర్నా తరువాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం’అని రైతులకు హామీ ఇచ్చారు. పలువురు మంత్రులు కూడా ప్రైవేటు సంభాషణల్లో ఇదే విషయాన్ని చెప్తున్నా.. సీఎం కేసీఆర్‌ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని అంటున్నారు. 

కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకే.. 
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని రైతు వ్యతిరేక సర్కార్‌గా జనం ముందు నిలబెట్టడంలో విజయం సాధించినట్టు భావిస్తున్న టీఆర్‌ఎస్‌ పెద్దలు.. ఇదే ఊపులో తాము మాత్రమే రైతాంగాన్ని ఆదుకోగలమనే సందేశం పంపేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 11న ఢిల్లీలో జరిగే ధర్నాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు పాల్గొని.. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నారు. అంతా హైదరాబాద్‌కు తిరిగొచ్చాక మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి.. పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోళ్లపై ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. గత యాసంగి కంటే వరిసాగు తగ్గడం, మిల్లర్లు, దళారుల కొనుగోళ్ల నేపథ్యంలో.. ఈసారి ప్రభుత్వ కేంద్రాలను తక్కువగానే ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 

కొనుగోలు ఇలా..!
► రైతులకు మద్దతుధర కింద సాధారణ ధాన్యాన్ని రూ.1,940 ధరతో, ఏ గ్రేడ్‌ ధాన్యాన్ని రూ.1,960 ధరతో కొనుగోలు చేసి.. ముడిబియ్యంగా మిల్లింగ్‌ చేయించాలనేది రాష్ట్ర సర్కారు ఆలోచన.
► గతంలో మాదిరిగా కాకుండా అవసరమైన మేరకే కొనుగోలు కేంద్రాలు తెరిచే అవకాశం.
► మిల్లర్లు ముడిబియ్యం ఎంతమేర కొంటారో చూసుకుని, మిగతా బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాలనే యోచన.
► అదనపు నూకలను ఏం చేయాలన్న దానిపై తర్జనభర్జన
► ఈ చర్యలతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,000 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా.

పెరిగే నూకలను ఏం చేద్దాం? 
► సాధారణంగా క్వింటాల్‌ ధాన్యం మిల్లింగ్‌ చేస్తే.. బియ్యం, నూకలు కలిపి 67 కిలోలు వస్తాయి. ఇందులో 50 కిలోల బియ్యం, 17 కిలోల నూకలు ఉండటాన్ని  ఎఫ్‌సీఐ అనుమతిస్తుంది. ఈ బియ్యం, నూకలను తీసుకుని.. క్వింటాల్‌ ధాన్యంగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వానికి కనీస మద్ధతు ధర అయిన రూ.1,960 చొప్పున చెల్లిస్తుంది. వానాకాలం ధాన్యం మిల్లింగ్‌ చేసినప్పుడు ఎఫ్‌సీఐ ప్రమాణాల మేరకు బియ్యం, నూకలు వస్తాయి. దానితో సమస్య ఉండదు. 
► యాసంగిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా మరో 17 కిలోల నూకలు అదనంగా వస్తాయి. అంటే సాధారణంగా వచ్చే 17 కిలోలు, ఈ 17 కిలోలు కలిపి 34 కిలోలు నూకలే వస్తాయి. మిగతా 33 కిలోలు మాత్రమే బియ్యం ఉంటాయి. ఈ క్రమంలోనే అదనపు నూకలను ఏం చేసుకోవాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. తగ్గిపోయే ఒక్కో కిలో బియ్యానికి రూ.30 చొప్పున లెక్కిస్తే.. ప్రతి క్వింటాల్‌ ధాన్యానికి రూ.400 నుంచి రూ.500 వరకు రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుందని అంచనా. ఈ మొత్తాన్ని సర్కారు భరించగలిగితే రైతులకు న్యాయం జరుగుతుందని మిల్లర్లు కూడా చెప్తున్నారు.

సర్కారు కొనడం లేదని దళారులు వస్తున్నరు 
నేను ఏడెకరాలలో వరి వేసిన. ఎకరానికి 40 బస్తాల లెక్కన వచ్చింది. సర్కారు కొనడం లేదంటూ దళారులు నా దగ్గరికొచ్చి వడ్లు కొనుక్కొనిపోయిన్రు. పెట్టుబడి పోను ఎకరానికి వెయ్యి రూపాయలు కూడా మిగలలేదు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు సెంటర్లు పెట్టాలి. 
– శివశంకర్, జకోరా, నిజామాబాద్‌ జిల్లా  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top