
ఇది వరంగల్ స్మార్ట్‌సిటీ పథకంలో భాగంగా రూ. 250 కోట్లతో అమ్మవారిపేటలో చేపట్టిన మానవ వ్యర్థాల ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎఫ్‌ఎస్‌టీపీ). పనులు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెబుతున్నా చాలా వరకు సివిల్, ప్లాంట్ పనులు ఏళ్ల తరబడి ఇలా పెండింగ్‌లోనే దర్శనమిస్తున్నాయి.
నత్తనడకన స్మార్ట్‌సిటీ,అమృత్ పనులు
మార్చి 31తో ముగిసిన ‘స్మార్ట్’ గడువు.. ఇంకా కొనసాగుతున్న నిర్మాణాలు
అమృత్ 2.0 కింద పనుల్లో మరింత ఆలస్యం
రూ. కోట్లు ఖర్చు చేసినా వినియోగంలోకి రాని పథకాలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో స్మార్ట్‌సిటీస్ మిషన్ (ఎస్‌సీఎం), అమృత్ (అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్) పథకాల కింద కొనేళ్ల కిందట మొదలైన అభివృద్ధి పనులు నేటికీ నత్తనడకన సాగుతున్నాయి. ముఖ్యంగా పదేళ్ల కిందట ప్రకటించిన స్మార్ట్‌సిటీ మిషన్ పథకం గడువు ఈ ఏడాది మార్చి 31నే పూర్తయినా పనులు మాత్రం ఇంకా పూర్తికాలేదు.
అలాగే వచ్చే ఏడాది మార్చిలో రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో ‘అమృత్’పనులను ముగించాల్సి ఉన్నా ఇంకా తుదిదశకు చేరుకోలేదు. పలు ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణలో సమస్యలు తలెత్తడం, నిధుల విడుదలలో జాప్యం వల్ల పనులుగడువులోగా పూర్తికాలేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మౌలిక వసతులు కరువై పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
స్మార్ట్ కింద రెండు..అమృత్ కింద 31 పట్టణాలు
దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కేంద్రం స్మార్ట్‌సిటీ మిషన్ పథకం కింద 100 నగరాలను ఎంపిక చేసింది. అలాగే 500 పట్టణాలు/నగరాలను అమృత్ పథకం కింద గుర్తించింది. పట్టణ ప్రాంతాల్లో రవాణా, నీటి సరఫరా, విద్యుత్, మురుగునీటి శుద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, రోడ్లు, డిజిటల్ సేవల మెరుగు, స్మార్ట్ టెక్నాలజీ తదితర 16 అంశాలను లక్ష్యంగా పెట్టుకుంది. నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, డిజిటల్ సేవల మెరుగు, స్మార్ట్ టెక్నాలజీకి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది.
స్మార్ట్‌సిటీ మిషన్ కింద తెలంగాణలో గ్రేటర్ వరంగల్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లను ఎంపిక చేయడంతోపాటు ‘అమృత్’తొలి విడతలో 12 నగరాలు/పట్టణాలను.. ఆ తర్వాత అమృత్ 2.0 కింద మరో 19 పట్టణాలను గుర్తించింది. కేంద్ర, రాష్ట్రాల చెరి సగం వాటా నిధులతో పనులకు శ్రీకారం చుట్టింది.
స్మార్ట్ కింద ఇంకా పూర్తవని పనులు ఇవీ..
వరంగల్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో స్మార్ట్‌సిటీ మిషన్ కింద రూ. 2,918 కోట్ల వ్యయంతో 169 ప్రాజెక్టులను మొదలుపెట్టగా రెండు కార్పొరేషన్లలో స్మార్ట్‌సిటీ మిషన్ గడువు ముగింపు నాటికి 85.2 శాతం పనులు మాత్రమే పూర్తయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వరంగల్ కార్పొరేషన్‌లో రూ. 1,800 కోట్లతో చేపట్టిన 119 ప్రాజెక్టుల్లో 84.9 శాతం పూర్తవగా అందులో రూ. 35 కోట్లతో చేపట్టిన 11 రోడ్ల పనులు 80 శాతం మాత్రమే పూర్తయ్యాయి.
ఇక కరీంనగర్‌లో రూ. 1,117 కోట్లతో చేపట్టిన 50 ప్రాజెక్టుల్లో పనులు 89 శాతం మేర జరిగాయి. రూ. 34.05 కోట్లతో వడ్డేపల్లి బండ్ పనులు 60 శాతమే పూర్తయ్యాయి. కరీంనగర్ కార్పొరేషన్‌లో అభివృద్ధి పనులకు కేంద్రం రూ. 35 కోట్లు మంజూరు చేయగా రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ రూ. 35 కోట్ల విడుదలలో జాప్యం కారణంగా పనులు నిలిచిపోయాయి. స్మార్ట్‌సిటీ మిషన్ కింద 47 ప్రాజెక్టులు చేపట్టగా కమాండ్ కంట్రోల్ భవన నిర్మాణం సహా ఐదు పనులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు.
‘అమృత్’ఆలస్యం..
అమృత్ పథకం తొలి విడత కింద ఆదిలాబాద్, రామగుండం, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట (ఎం), మహబూబ్‌నగర్, సూర్యాపేట, నల్లగొండ, మిర్యాలగూడ, వరంగల్, గ్రేటర్ హైదరాబాద్‌ను ఎంపిక చేసిన కేంద్రం.. అందుకోసం రూ. 1,663.08 కోట్లు కేటాయించింది. ఆ తర్వాత 2021 అక్టోబర్‌లో అమృత్ 2.0 కింద తెలంగాణలో 19 పట్టణాలు, నగరాలకు 252 ప్రాజెక్టుల కోసం రూ. 9,584.26 కోట్లు ప్రకటించింది.
ఇప్పటివరకు రూ. 5,355.05 కోట్ల విలువైన 107 ప్రాజెక్టుల పనులు చేపట్టగా రూ. 4,229.21 కోట్ల విలువైన 145 ప్రాజెక్టులకు డీపీఆర్‌లు సిద్ధమై టెండర్ల దశలో ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. ఆర్మూరు, గద్వాల, కాగజ్‌నగర్, కోదాడ, జనగామ, కోరుట్ల, కొత్తగూడెం, మంచిర్యాల, పాల్వంచ, సిరిసిల్ల, మెట్‌పల్లి, తాండూరు తదితర ప్రాంతాల్లో పనులు పూర్తికాలేదు.
పదేళ్లు అయినా..
భద్రకాళి బండ్ అభివృద్ధి, సుందరీకరణ పనులు పూర్తయితే వరంగల్ నగరానికి కొత్త అందం వస్తుందని భావించాం. కానీ పదేళ్లు గడుస్తున్నా ఆ పనులు పూర్తికాలేదు.
చింతాకుల ప్రభాకర్, ఏనుగులగడ్డ
ఎప్పుడు పూర్తవుతాయో..
మానవ వ్యర్థాల ట్రీట్‌మెంట్ ప్లాంట్ పనులు ఎప్పుడు పూర్తవుతాయో తేలియడం లేదు. ఎప్పుడు మాట్లాడినా చివరి దశకు చేరుకున్నాయంటున్నారే తప్ప పూర్తి చేసిందైతే లేదు.
– అనుమాస ప్రచన్యకుమార్, మామునూరు, వరంగల్
వెంటనే పూర్తి చేయాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో మంజూరైన మూడు ఎస్టీపీల పనులు వెంటనే చేపట్టాలి. రెండేళ్లు దాటినా ఇంకా శ్రీకారం చుట్టకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణం.
– పగడం మల్లేశ్, పద్మావతికాలనీ, మహబూబ్‌నగర్
భూసేకరణపై స్పష్టత రావాలి..
మహబూబ్‌నగర్ నగర పరిధిలో నిర్మించే మూడు ఎస్‌టీపీలకు భూసేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయితే 9 నెలల్లోనే ఎస్‌టీపీలను నిర్మిస్తాం. గడువులోగా పనుల పూర్తికి ప్రయతి్నస్తున్నాం.
– విజయభాస్కర్‌రెడ్డి, ఈఈ, పబ్లిక్‌హెల్త్, మహబూబ్‌నగర్