breaking news
Smart Cities mission
-
'స్మార్ట్'గా సాగట్లేదు!
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో స్మార్ట్‌సిటీస్ మిషన్ (ఎస్సీఎం), అమృత్ (అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్) పథకాల కింద కొనేళ్ల కిందట మొదలైన అభివృద్ధి పనులు నేటికీ నత్తనడకన సాగుతున్నాయి. ముఖ్యంగా పదేళ్ల కిందట ప్రకటించిన స్మార్ట్‌సిటీ మిషన్ పథకం గడువు ఈ ఏడాది మార్చి 31నే పూర్తయినా పనులు మాత్రం ఇంకా పూర్తికాలేదు. అలాగే వచ్చే ఏడాది మార్చిలో రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో ‘అమృత్’పనులను ముగించాల్సి ఉన్నా ఇంకా తుదిదశకు చేరుకోలేదు. పలు ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణలో సమస్యలు తలెత్తడం, నిధుల విడుదలలో జాప్యం వల్ల పనులుగడువులోగా పూర్తికాలేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మౌలిక వసతులు కరువై పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. స్మార్ట్ కింద రెండు..అమృత్ కింద 31 పట్టణాలు దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కేంద్రం స్మార్ట్‌సిటీ మిషన్ పథకం కింద 100 నగరాలను ఎంపిక చేసింది. అలాగే 500 పట్టణాలు/నగరాలను అమృత్ పథకం కింద గుర్తించింది. పట్టణ ప్రాంతాల్లో రవాణా, నీటి సరఫరా, విద్యుత్, మురుగునీటి శుద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, రోడ్లు, డిజిటల్ సేవల మెరుగు, స్మార్ట్ టెక్నాలజీ తదితర 16 అంశాలను లక్ష్యంగా పెట్టుకుంది. నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, డిజిటల్ సేవల మెరుగు, స్మార్ట్ టెక్నాలజీకి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. స్మార్ట్‌సిటీ మిషన్ కింద తెలంగాణలో గ్రేటర్ వరంగల్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లను ఎంపిక చేయడంతోపాటు ‘అమృత్’తొలి విడతలో 12 నగరాలు/పట్టణాలను.. ఆ తర్వాత అమృత్ 2.0 కింద మరో 19 పట్టణాలను గుర్తించింది. కేంద్ర, రాష్ట్రాల చెరి సగం వాటా నిధులతో పనులకు శ్రీకారం చుట్టింది. స్మార్ట్ కింద ఇంకా పూర్తవని పనులు ఇవీ.. వరంగల్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో స్మార్ట్‌సిటీ మిషన్ కింద రూ. 2,918 కోట్ల వ్యయంతో 169 ప్రాజెక్టులను మొదలుపెట్టగా రెండు కార్పొరేషన్లలో స్మార్ట్‌సిటీ మిషన్ గడువు ముగింపు నాటికి 85.2 శాతం పనులు మాత్రమే పూర్తయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వరంగల్ కార్పొరేషన్లో రూ. 1,800 కోట్లతో చేపట్టిన 119 ప్రాజెక్టుల్లో 84.9 శాతం పూర్తవగా అందులో రూ. 35 కోట్లతో చేపట్టిన 11 రోడ్ల పనులు 80 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఇక కరీంనగర్లో రూ. 1,117 కోట్లతో చేపట్టిన 50 ప్రాజెక్టుల్లో పనులు 89 శాతం మేర జరిగాయి. రూ. 34.05 కోట్లతో వడ్డేపల్లి బండ్ పనులు 60 శాతమే పూర్తయ్యాయి. కరీంనగర్ కార్పొరేషన్లో అభివృద్ధి పనులకు కేంద్రం రూ. 35 కోట్లు మంజూరు చేయగా రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ రూ. 35 కోట్ల విడుదలలో జాప్యం కారణంగా పనులు నిలిచిపోయాయి. స్మార్ట్‌సిటీ మిషన్ కింద 47 ప్రాజెక్టులు చేపట్టగా కమాండ్ కంట్రోల్ భవన నిర్మాణం సహా ఐదు పనులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. ‘అమృత్’ఆలస్యం.. అమృత్ పథకం తొలి విడత కింద ఆదిలాబాద్, రామగుండం, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట (ఎం), మహబూబ్‌నగర్, సూర్యాపేట, నల్లగొండ, మిర్యాలగూడ, వరంగల్, గ్రేటర్ హైదరాబాద్‌ను ఎంపిక చేసిన కేంద్రం.. అందుకోసం రూ. 1,663.08 కోట్లు కేటాయించింది. ఆ తర్వాత 2021 అక్టోబర్‌లో అమృత్ 2.0 కింద తెలంగాణలో 19 పట్టణాలు, నగరాలకు 252 ప్రాజెక్టుల కోసం రూ. 9,584.26 కోట్లు ప్రకటించింది. ఇప్పటివరకు రూ. 5,355.05 కోట్ల విలువైన 107 ప్రాజెక్టుల పనులు చేపట్టగా రూ. 4,229.21 కోట్ల విలువైన 145 ప్రాజెక్టులకు డీపీఆర్‌లు సిద్ధమై టెండర్ల దశలో ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. ఆర్మూరు, గద్వాల, కాగజ్‌నగర్, కోదాడ, జనగామ, కోరుట్ల, కొత్తగూడెం, మంచిర్యాల, పాల్వంచ, సిరిసిల్ల, మెట్పల్లి, తాండూరు తదితర ప్రాంతాల్లో పనులు పూర్తికాలేదు. పదేళ్లు అయినా.. భద్రకాళి బండ్ అభివృద్ధి, సుందరీకరణ పనులు పూర్తయితే వరంగల్ నగరానికి కొత్త అందం వస్తుందని భావించాం. కానీ పదేళ్లు గడుస్తున్నా ఆ పనులు పూర్తికాలేదు. చింతాకుల ప్రభాకర్, ఏనుగులగడ్డ ఎప్పుడు పూర్తవుతాయో.. మానవ వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు ఎప్పుడు పూర్తవుతాయో తేలియడం లేదు. ఎప్పుడు మాట్లాడినా చివరి దశకు చేరుకున్నాయంటున్నారే తప్ప పూర్తి చేసిందైతే లేదు. – అనుమాస ప్రచన్యకుమార్, మామునూరు, వరంగల్వెంటనే పూర్తి చేయాలి మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో మంజూరైన మూడు ఎస్టీపీల పనులు వెంటనే చేపట్టాలి. రెండేళ్లు దాటినా ఇంకా శ్రీకారం చుట్టకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణం. – పగడం మల్లేశ్, పద్మావతికాలనీ, మహబూబ్నగర్భూసేకరణపై స్పష్టత రావాలి.. మహబూబ్‌నగర్ నగర పరిధిలో నిర్మించే మూడు ఎస్టీపీలకు భూసేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయితే 9 నెలల్లోనే ఎస్టీపీలను నిర్మిస్తాం. గడువులోగా పనుల పూర్తికి ప్రయతి్నస్తున్నాం. – విజయభాస్కర్‌రెడ్డి, ఈఈ, పబ్లిక్‌హెల్త్, మహబూబ్‌నగర్ -
నగరాలకు నయా లుక్..! ఎన్‌ఎంఎస్‌హెచ్ రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు
సాక్షి, అమరావతి: రానున్న ఎనిమిదేళ్లలో దేశంలోని పట్టణాల రూపురేఖలను సమూలంగా మార్చాలని అందుకు అవసరమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణ ప్రణాళికలో మార్పులు చేయాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘నేషనల్ మిషన్ ఆన్ సస్టెయినబుల్ హబిటాట్–2021–30’ రిపోర్టులో పట్టణ ప్రణాళికలపై పలు ఆసక్తికరమైన వివరాలను పొందుపరిచింది. ‘స్మార్ట్ సిటీస్ మిషన్’ నివేదిక ప్రకారం 2030 నాటికి దేశంలోని పట్టణాల్లో నివసించే జనాభా 40% కంటే అధికంగా పెరుగుతుందని.. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 75 శాతం పట్టణాల నుంచే వస్తుందని అంచనా వేసింది. చదవండి: ఇల్లు చూపి ఇల్లాలిని చేసుకునే ఓ ‘పిట్ట’ కథ ఫలితంగా ఇక్కడి నుంచి వాతావరణానికి హానిచేసే ‘గ్రీన్హౌస్ వాయువులు’ కూడా అధికంగా ఉత్పత్తయ్యే అవకాశముందని, ఈ ప్రభావాన్ని తట్టుకునేందుకు నగర, పట్టణాల మాస్టర్ ప్లాన్లు అవసరమని పేర్కొంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ప్రణాళిక విభాగం ఇప్పటికే ఈ తరహా మాస్టర్ ప్లాన్‌ను సిద్ధంచేసి, అమలుచేస్తుండడం గమనార్హం. 2,843 నగరాలకే సరైన మాస్టర్ ప్లాన్ దేశంలో జూలై 2019 నాటికి 7,933 నగరాలు, పట్టణాలు ఉండగా, వాటిలో 2,843 వాటికి మాత్రమే చట్టబద్ధమైన మాస్టర్ ప్లాన్లు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. జోనల్ డెవలప్మెంట్ ప్లాన్లు, లోకల్ ఏరియా ప్లాన్లు, లేఅవుట్ ప్లాన్లు సైతం సక్రమం గాలేవని, చాలా నగరాలు, పట్టణాలకు సరైన ప్రణాళిక లేకపోవడంతో పాటు, ఉన్నవాటిపై కూడా ఏళ్ల తరబడి సమీక్షలు చేయలేదని వివరించింది. దీంతో పెరుగుతున్న జనాభాకు అనుగు ణంగా వసతులు సమకూర్చడం పట్టణ స్థానిక సంస్థలకు కష్టతరంగా మారుతోందని ఆందోళన వ్యక్తంచేసింది. దీంతోపాటు జనాభా, నివాసాలపై సరైన డేటా లేకపోవడం కూడా మౌలిక సదుపాయాల కల్పనకు ఆటంకంగా మారిందని పేర్కొంది. వీటిని అధిగమించేందుకు ఆధునిక పద్ధతుల్లో పట్టణ ప్రణాళికలు రూపొందించి అమలుచేసి 2030 నాటికి పూర్తిచేయగలిగితే వాతావరణ మార్పులవల్ల తలెత్తే ఉపద్రవాలను సమర్థంగా ఎదుర్కోవచ్చని సూచించింది. అందుకోసం పట్టణ ప్రణాళికలకు సంబంధించి పూర్తి భౌగోళిక సమాచారం (జీఐఎస్), రిమోట్ సెన్సింగ్ పద్ధతులను అనుసరించాలని ఆ నివేదిక సూచించింది. దీనిద్వారా ఆయా పట్టణాల్లోని చెరువులు, నీటి కొలనులు, రోడ్లు, కాలువలతో పాటు బహిరంగ ప్రదేశాలను మెరుగ్గా గుర్తించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న ఆక్రమణలను గుర్తించి సమర్థంగా అడ్డుకోవచ్చని వివరించింది. పచ్చదనానికి ప్రాధాన్యం ఇక పట్టణాలను భయపెడుతున్న వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆయా ప్రాంతాల్లో పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అప్పుడు గ్రీన్హౌస్ వాయువులను నియంత్రించగలమని ‘నేషనల్ మిషన్ ఆన్ సస్టెయినబుల్ హబిటాట్–2021–30’ నివేదిక పేర్కొంది. సాధ్యమైనంత మేర గ్రీన్ జోన్లను అభివృద్ధి చేసినట్లయితే మైక్రో క్లైమేట్ నియంత్రణలో ఉంటుందని, అందువల్ల అన్ని నగరాలు తమ సామర్థ్యం మేరకు మార్పులు తీసుకురావాలని సూచించింది. పైగా అత్యవసర పరిస్థితుల్లో సహాయ కార్యకలాపాల కోసం క్విక్ రెస్పాన్స్ మెకానిజాన్ని అందుబాటులో ఉంచుకోవాలని కోరింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఈ తరహా ఏర్పాట్లుచేసింది. ముఖ్యంగా అన్ని పట్టణాల్లోను పచ్చదనం అభివృద్ధి చేసేందుకు ‘జగనన్న గ్రీన్‌సిటీ చాలెంజ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించి తొలివిడతలో 45 పట్టణాల్లో అమలు చేస్తున్నారు. అలాగే, వరదలవల్ల వచ్చే నష్టాన్ని తగ్గించేందుకు, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు స్పాంజీ సిటీల నిర్మాణానికి సంకల్పించింది. మరోవైపు.. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సమగ్ర పట్టణ సర్వే పూర్తయితే, రాష్ట్రంలోని మొత్తం 123 యూఎల్బీల్లోని జనాభా, నివాసాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, చెరువులు, కాలువలు, రోడ్లతో సహా సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తుందని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు చెబుతున్నారు. పణాళికలో మార్పులు తప్పదన్న ‘ఎస్సీఎం’ ♦మరోవైపు.. ప్రజలకు సౌకర్యవంతమైన స్థిరమైన జీవనం గడిపేందుకు పట్టణ ప్రణాళికలో కీలకమైన పలు మార్పులు అవసరమని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ♦పరిధిలోని ‘స్మార్ట్ సిటీస్ మిషన్’ సూచించింది. ఇందులో గ్రీన్ కవర్, జీవవైవిధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. అలాగే.. ♦ఆయా పట్టణాల్లోని ఎకో–సెన్సిటివ్ జోన్లను మ్యాపింగ్ చేయాలని, హాట్స్పాట్లు, నగరంలోని సహజ వనరులు సహా నీటి వనరులు, వాటి పరీవాహక ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలు వంటి అన్ని రకాల ప్రాం తాలను డిజిటలైజేషన్ చేయాలని సూచించింది. ♦విపత్తులు సంభవించినప్పుడు తగిన చర్యలు తీసుకునేందుకు యూఎల్బీ (అర్బన్ లోకల్‌బాడీలు–పట్టణ స్థానిక సంస్థలు)ల పరిధిలో యంత్రాంగం ఉండాలని తెలిపింది. ♦వరదలు సంభవించినప్పుడు ప్రవాహం పారేందుకు అనువుగా నిర్మాణాలు ఉండాలని.. కాలువలు, చెరువులపై ఆక్రమణలను నిరోధించాలని, సాధ్యమైనంత ఎక్కువ ప్రాంతాల్లో పచ్చదనాన్ని అభివృద్ధిచేయాలని సూచించింది. ♦ఇందులో ప్రధానంగా స్థానిక వృక్ష జాతులకు ప్రాధాన్యం ఇవ్వాలని.. విపత్తుల నివారణకు సరైన ప్రణాళికలు సిద్ధంగా ఉండాలని, ఇప్పటికే ఉన్న సహజ నీటివనరుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరింది. ♦అన్ని పట్టణాలు, నగరాల్లో డ్రైనేజీ నెట్‌వర్క్‌ను డిజిటలైజ్ చేసి ఉంచడంతో పాటు డ్రైనేజీ మాస్టర్ ప్లాన్లను సిద్ధంచేసుకోవాలని సూచించింది. ♦అంతేగాక.. నగర విస్తీర్ణంలో 10–12 శాతంవాటర్ బాడీలను వినోద కేంద్రాలుగా అభివృద్ధి చేయడంతో పాటు అర్బన్ అండ్ రీజినల్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ గైడ్‌లెన్స్‌ను అమలుచేయాలని సూచించింది. ♦మాస్టర్ ప్లాన్ పరిధిలో ఉన్న పరిశ్రమల చుట్టూ గ్రీన్‌బెల్ట్ బఫర్ జోన్లను అభివృద్ధి చేయాలి. ♦పట్టణ మాస్టర్ ప్లాన్‌లో నీటి సరఫరా, మురుగునీరు, వరద నీరు ప్రవాహాలకు ప్రత్యేక నెట్వర్క్ ఉండాలని సూచించింది. -
సైకిల్‌వాలా జిందాబాద్!
సాక్షి, హైదరాబాద్: త్వరలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఖైరతాబాద్ జోన్లో ప్రత్యేక సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు కానున్నాయి. స్మార్ట్ సిటీస్ కార్యక్రమంలో భాగంగా కేంద్రం చేపట్టిన ‘ఇండియా సైకిల్ 4 చేంజ్ చాలెంజ్ (సీ4సీ చాలెంజ్)’ అమలు చర్యల్లో భాగంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. సైకిల్ ఫ్రెండ్లీ సిటీస్‌గా సీ4సీ చాలెంజ్‌కు నమోదైన 95 నగరాల్లో రాష్ట్రం నుంచి హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్‌లు కూడా ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా ప్రజల్లో సైకిల్ వినియోగాన్ని పెంచేందుకు కూడా ఈ కార్యక్రమాన్ని అనువుగా మలచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ), హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ(హుమ్టా) పూర్తి స్థాయిలో తగిన సాంకేతిక సహకారం, సలహాలు అందిస్తాయి. పైలట్ ప్రాజెక్ట్‌గా తొలుత ఖైరతాబాద్ జోన్లో అమలు చేసేందుకు హెచ్ఎండీఏ, హుమ్టా, జీహెచ్ఎంసీలు నిర్ణయించాయి. అందుకుగాను ఆ విభాగాల అధికారులతోపాటు ట్రాఫిక్ పోలీసులు సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటు తదితర అంశాలతో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. జోన్‌లోని 23 కి.మీ.ల పొడవునా(రెండు వైపులా వెరసి 46 కి.మీ.) ఏడు సైకిల్ ట్రాక్‌ల మార్గాల్ని గుర్తించారు. తొలిదశలో పది కి.మీ.ల మేర అమలు చేస్తారు. ఎదురయ్యే సాధకబాధకాలు, ప్రజల స్పందన, ఫలితాన్ని బట్టి మిగతా మార్గాల్లో ఏర్పాటు చేస్తారు. సైకిల్‌ట్రాక్‌లు అందుబాటులోకి తెచ్చే ప్రాంతాల్లో తగిన సైనేజీలు, రోడ్మార్కింగ్లు, బారికేడింగ్, ప్లగ్ ప్లే బొల్లార్డ్ వంటివి ఏర్పాటు చేస్తారు. సైక్లిస్టుల భద్రతకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు పూర్తి సహకారం అందజేస్తారు. దశలవారీగా 450 కి.మీ.ల మేర.. ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం మెట్రో రైలు స్టేషన్లు, ఆర్టీసీ బస్ టెర్మినళ్లు, డిపోలు,ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్ద అందుబాటులో ఉన్న స్థలాల్లో పబ్లిక్ బైసికిల్ షేరింగ్ డాక్స్ (పీబీఎస్) ఏర్పాటు చేస్తారు. భవిష్యత్‌లో దశలవారీగా సైబరాబాద్, హైటెక్‌సిటీ, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, చార్మినార్, మెహదీపట్నం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్ నాలెడ్జ్ సెంటర్, కోకాపేట ప్రాంతాల్లో 450 కి.మీ.ల మేర సైకిల్మార్గాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో తక్కువ దూర ప్రయాణాలకు సైకిల్ ప్రయాణం మేలని, అందుకు తగిన మార్గాలు అవసరమని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. చాలెంజ్.. రెండు దశల్లో.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు సీ4సీ కార్యక్రమాన్ని రెండు దశల్లో అమలు చేస్తారు. తొలి దశలో పైలట్‌గా సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటు ప్రణాళిక, ప్రజల్లో అవగాహన కల్పించడం, వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం వంటివి ఉంటాయి. మొదటి దశకు అక్టోబర్ 14 చివరి తేదీ. దీనికి సంబంధించి 95 నగరాల నుంచి అందిన ప్రణాళికలు, అమలు, వ్యూహాలు తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని రెండో దశకు 11 నగరాలను ఎంపిక చేస్తారు. అక్టోబర్ 28 వరకు ఈ ఎంపిక పూర్తిచేస్తారు. ఎంపికైన నగరాలకు కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వశాఖ కోటి రూపాయలు చొప్పున అవార్డుగా అందజేస్తుంది. ఎంపికైన నగరాలకు జాతీయ, అంతర్జాతీయ నిపుణులు తగిన సలహాలిస్తారు. రెండో దశ సైకిల్నెట్వర్క్ కార్యక్రమం వచ్చే సంవత్సరం మే నెలాఖరు వరకు పూర్తికాగలదని భావిస్తున్నారు. -
'స్మార్ట్ మిషన్'లో ప్రైవేట్ రంగమే కీలకం
న్యూఢిల్లీ : మనదేశంలో ప్రభుత్వం రంగంతో పాటు, ప్రైవేట్ రంగానికి ఉన్న క్రేజ్ తక్కువేమీ కాదు. ఈ నేపథ్యంలో స్మార్ట్ సిటీల రూపకల్పనలో ప్రైవేట్ రంగమే కీలక పాత్ర పోషించ నుందని సర్వేలు తేల్చి చెప్పాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, ప్రైస్ వాటర్ హౌస్ కార్పొరేషన్ సంయుక్తంగా జరిపిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా మౌలిక సదుపాయాలు, మున్సిపల్ సర్వీసులు కల్పించకపోతే పట్టణ ప్రాంతాల వృద్ధి జరదని సర్వేలు స్పష్టం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు, అర్బన్ స్థానిక సంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఎక్కడైనా సమస్య వచ్చినా సహాయ పడటంలో ప్రైవేటు రంగం కీలకపాత్ర పోషిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2050 ఏడాది వరకు పట్టణ జనాభా 66 శాతం పెరుగుతుందని, దీనిలో భారత్ పాత్రే ఎక్కువగా ఉంటుందని చెప్పాయి. భారత్ లో పట్టణ జనాభా దాదాపు 410 మిలియన్. ఇది మొత్తం జనాభాకు 32 శాతం. అయితే ఈ జనాభా 2050 కల్లా 814 మిలియన్ కు లేదా ప్రపంచ జనాభాలో సగానికి కన్నా చేరుకుంటుందని ఈ సర్వేలు అంచనావేస్తున్నాయి. ఈ కారణంగానే కేంద్రప్రభుత్వం 100 స్మార్ట్ సిటీలు, 500 సిటీలను అటల్ మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్సిమిషన్ కింద ఎంపిక చేసిందని పేర్కొన్నాయి. ఈ సిటీల రూపకల్పనలో ప్రైవేట్ రంగం ఎంతో సహాయం అందిస్తుందని సర్వేలు తెలిపాయి.