హస్తినలో కదం తొక్కిన తెలంగాణ కాంగ్రెస్‌ | Revanth Reddy Congress Supreme Court March Delhi | Sakshi
Sakshi News home page

హస్తినలో కదం తొక్కిన తెలంగాణ కాంగ్రెస్‌

Oct 13 2026 5:42 AM | Updated on Oct 13 2026 5:42 AM

Revanth Reddy Congress Supreme Court March Delhi

ర్యాలీలో రేవంత్‌రెడ్డి, మహేశ్‌గౌడ్, శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి, అంజన్‌కుమార్, మైనంపల్లి తదితరులు

ఇండియా కూటమి ఆందోళనలో ముందుండి నడిచిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు

అన్ని జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన నేతలు..తెలంగాణ భవన్‌లో హడావుడి

టీపీసీసీ అధ్యక్షుడి నేతృత్వంలో బారాకంబాలో భారీ నిరసనలో పాల్గొన్న నేతలు

కాంగ్రెస్‌ నేతలంతా ఇంకా ఢిల్లీలోనే...

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇండియా కూటమి హస్తినలో చేపట్టిన మార్చ్‌ ఫర్‌ డెమోక్రసీలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కదం తొక్కారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కైన ఎన్నికల కమిషన్‌ కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకొని భారీ ఓట్ల చోరీకి పాల్పడుతోందంటూ కన్నెర్ర జేశారు. దేశంలోని యువత, మైనారీ్టలే లక్ష్యంగా సాగుతున్న ఓట్ల తొలగింపును నిరసిస్తూ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్‌)ను నిలిపివేయాలంటూ గళమెత్తారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఈ నిరసనలో పాల్గొన్నారు.

గళమెత్తి.. పిడికిలి బిగించి.. 
దేశవ్యాప్తంగా సర్‌ పేరుతో 13 కోట్లకు పైగా ఓట్ల తొలగింపు, ఫారం–6, కొత్త ఓటర్లకు ఇబ్బందులు, ఓట్ల తొలగింపులో అవకతవకలు వంటి అంశాలను ఎండగట్టేందుకు ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జునఖర్గే, రాహుల్‌గాం«ధీ, ప్రియాంకాగాంధీ చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా, ఇండియాకూటమికి సంఘీభావంగా నిర్వహించిన మార్చ్‌లో తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో నేతలు హాజరయ్యారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది నేతలు, కార్యకర్తలతో తెలంగాణభవన్‌లో సోమవారం ఉదయం నుంచి హడావుడి మొదలైంది.

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని, ఓట్ల చోరీని ఆపాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసనకు దిగారు. ఉదయం 11 గంటలకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వాకిటి శ్రీహరి తదితరులు భవన్‌కు రాగా అక్కడే ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో వారు నిరసన కార్యక్రమాలపై చర్చించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ సైతం వారితో కలిశారు.

ఈ సందర్భంగా ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉండగా, ఒక రాజకీయ పారీ్టకి అనుకూలంగా పనిచేస్తోందని కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. మధ్యా­హ్నం 12 గంటల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు మిగతా మంత్రులు భవన్‌కు చేరుకొని అంబేడ్కర్‌ ఆడిటోరియంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి, మహేశ్‌గౌడ్‌ నిరసన అంశాలపై కాంగ్రెస్‌ శ్రేణులకు మార్గదర్శనం చేశారు. జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలన్న భారీ ప్లకార్డును పట్టుకొని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు భారీ పోస్టర్‌ను ప్రదర్శించారు.

భవన్‌ నుంచి బస్సుల్లో మార్చ్‌కు..బారాకంబాలో నిరసన అనంతరం తెలంగాణభవన్‌ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు, ఇతర నేతలు ప్రత్యేక బస్సుల్లో బారాకంబాకు చేరుకున్నారు. అక్కడ భారీ పోస్టర్లు ప్రదర్శిస్తూ బారాకంబా మెట్రోస్టేషన్‌ ఎదుట నిరసనకు దిగారు.

ఈసీ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ నుంచి బారాకంబాకు వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి అగ్రనేతలతో కలిసి సుప్రీంకోర్టు వరకు జరిగిన మార్చ్‌లో ముందుండి నడిచారు.ఇండియా కూటమి నేతలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి పాదయాత్రగా వెళ్లారు. అయితే ఢిల్లీకి వెళ్లిన కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, డీసీసీ అధ్యక్షులంతా ఇక్కడే, ఉండాలని, తాము చెప్పాకే హైదరాబాద్‌కు వెళ్లాని సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ అన్నట్టు తెలిసింది.

ఇదీ చదవండి: ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన జగన్‌ ఓడిపోవడమేంటి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement