
సాక్షి, హైదరాబాద్: గోదావరి– కావేరీ నదుల అనుసంధానంలో భాగంగా గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మించి నీళ్లను తరలించాలనే ప్రతిపాదనలకు తెలంగాణ షరతులతో సమ్మతి తెలిపింది. ఇచ్చంపల్లి బరాజ్ వల్ల దిగువన ఉన్న సమ్మక్క సాగర్‌పై ఏ ప్రభావం పడదని అధ్యయనాల్లో తేలిన తర్వాతే ముందుకెళ్లాలని స్పష్టం చేసింది. దేవాదుల కింద 38 టీఎంసీలు, సీతారామ కింద 67 టీఎంసీలు, సమ్మక్క సాగర్ కింద 47 టీఎంసీల నీళ్లను తాము వినియోగించుకున్న తర్వాత మిగిలే నీళ్లను గోదావరి – కావేరి అనుసంధానంలో భాగంగా తరలించేందుకు ఉన్న అవకాశాలపై సిమ్యులేషన్ స్టడీస్ జరిపి.. సానుకూల ఫలితాలు వస్తేనే ముందుకు వెళ్ళాలని సూచించింది.
నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఆధ్వర్యంలో నదుల అనుసంధానంపై ఏర్పాటైన టాస్‌్కఫోర్స్ శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో సంబంధిత రాష్ట్రాలతో సంప్రదింపుల సమావేశం నిర్వహించింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అతుల్‌కుమార్ జైన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అధికారులు ప్రత్యక్షంగా హాజరుకాగా, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ రాష్ట్రాల అధికారులు వర్చువల్‌గా హాజరయ్యారు. తెలంగాణ తరఫున హాజరైన వారిలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) అంజాద్ హుస్సేన్, గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.సుబ్రమణ్యం ప్రసాద్, కృష్ణా బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.విజయకుమార్ ఉన్నారు. ఏపీ జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నర్సింహమూర్తి, అంతర్రాష్ట్ర విభాగం చీఫ్ ఇంజనీర్ సుధాకర్ హాజరయ్యారు.
కేంద్రం నిధులతో 2 జలాశయాలు కట్టించాలి
జాతీయ ప్రయోజనాలు ఇమిడిలేని ఇంట్రా లింక్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వరాదని, గోదావరి–కావేరీ అనుసంధానం ద్వారా తరలించే నీటిలో 50 శాతం వాటా తెలంగాణకు ఇవ్వాలని రాహుల్ బొజ్జా కోరారు. ఇచ్చంపల్లి బరాజ్ కడితే అక్కడి నుంచి 200 టీఎంసీల వరద జలాలను వాడుకోవడానికి రాష్ట్రానికి అవకాశం ఇవ్వాలని కోరారు. అనుసంధానం ద్వారా లభించే రాష్ట్ర వాటా జలాలను ఎక్కడైనా వినియోగించుకుంటామని చెప్పారు. ఈ నీళ్లను నిల్వ చేసేందుకు రెండు జలాశయాలను కేంద్ర నిధులతో కట్టించి ఇవ్వాలన్నారు. సాధ్యమైనంత మేర ముంపును తగ్గించాలని సూచించారు. ఇచ్చంపల్లి నుంచి తరలించే జలాలను నాగార్జునసాగర్‌లో కాకుండా దిగువన 7 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న సాగర్ టెయిల్ పాండ్‌లో వేయాలన్నారు.
ఏపీ ఇంట్రా లింక్ ప్రాజెక్టులపై అభ్యంతరం
ఇదే ప్రాజెక్ట్ కింద ఏపీ ప్రతిపాదించిన నాలుగు ఇంట్రా లింక్ ప్రాజెక్టులను ఎన్‌డబ్ల్యూడీఏ పరిగణనలోకి తీసుకుని డీపీఆర్‌లను సమరి్పంచాల్సిందిగా ఆ రాష్ట్రాన్ని కోరడంపై రాహుల్ బొజ్జా తీవ్ర అభ్యంతరం తెలిపారు. కృష్ణా, గోదావరి ట్రిబ్యునల్ తీర్పులకు విరుద్ధంగా గోదావరి–బనకచర్ల ఆనుసంధానం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాకే.. ఈ నాలుగు ఇంట్రా లింక్ ప్రాజెక్టులను ఏపీ ప్రతిపాదించిందని సమావేశం దృష్టికి తెచ్చారు. అనుసంధానం ప్రాజెక్టుపై సమ్మతి తెలుపుతూ అవగాహన ఒప్పందంపై.. అందరి సమ్మతి, అధ్యయనాల తర్వాతే సంతకాలు చేస్తామని స్పష్టం చేశారు. గోదావరి పరీవాహకంలో రాష్ట్రంలో 968 టీఎంసీల సామర్ధ్యంతో చేపట్టిన ప్రాజెక్టులకు సత్వరంగా క్లియరెన్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
పోలవరం నుంచే చేపట్టాలి: ఆంధ్రప్రదేశ్
పోలవరం ప్రాజెక్టు నుంచే గోదావరి–కావేరీ అనుసంధానం చేపట్టాలని ఏపీ కోరింది. గోదావరిలో నీటి లభ్యతపై 2023 జూన్‌లో సీడబ్ల్యూసీ ఇచ్చిన నివేదిక ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, దాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. ఆ నివేదిక ఆధారంగానే గోదావరి–కావేరీ అనుసంధానం ప్రాజెక్టును ప్రతిపాదించారంటూ అభ్యంతరం తెలిపింది. ‘అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా కృష్ణాబేసిన్‌లో గోదావరి నీళ్లు వేస్తే.. బేసిన్‌పై ఆధారపడిన ఇతర రాష్ట్రాలూ వాటాలు కోరే అవకాశం ఉంది. గోదావరిలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ, వ్యాప్కోస్ అధ్యయనాల్లో తేడా ఉంది. అభ్యంతరాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి..’ అని ఏపీ కోరింది.
కనీసం 40 టీఎంసీలైనా ఇవ్వండి: కర్ణాటక
ప్రాజెక్టు ద్వారా తరలించే జలాల్లో తమకు కనీసం 40 టీఎంసీలను కేటాయించాలని కర్ణాటక కోరింది. ‘పూడికతో తుంగభద్ర జలాశయం 30 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయింది. బెడ్తి – వర్ధా అనుసంధానంతో ఏ మా త్రం ప్రయోజనం లేదు. తుంగభద్ర ఎగువన మరో లింకు ప్రతిపాదిస్తాం..’ అని తెలిపింది.
48% పరీవాహకం ఉన్నా నీళ్లు ఇవ్వరా?: మహారాష్ట్ర
‘గోదావరిలో 48 శాతం పరీవాహక ప్రాంతం మహారాష్ట్రలోనే ఉన్నా మా రాష్ట్రానికి ప్రాజెక్టు కింద నీళ్లు కేటాయించలేదు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఒక బేసిన్ నుంచి మరో బేసిన్‌కు నీళ్లను తరలిస్తే ఆ బేసిన్ పరిధిలోని అన్ని రాష్ట్రాలకు ఆ నీటిపై హక్కు ఉంటుంది. దాని ప్రకారం నీటి కేటాయింపులు చేయాలి..’ అని మహారాష్ట్ర కోరింది.
మా వాటా నీళ్లన్నీ వాడుకుంటాం: ఛత్తీస్‌గఢ్
’గోదావరి ట్రిబ్యునల్ కేటాయించిన మా వాటా నీళ్లను పూర్తిగా వాడుకుంటాం. మాకు గోదావరిలో 301 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా, 163 టీఎంసీల వినియోగానికి అనుగుణంగా ప్రణాళికలు ఉన్నాయి. 100 టీఎంసీలతో బోధఘాట్ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నాం..’ అని ఛత్తీస్‌గఢ్ పేర్కొనగా, సీడబ్ల్యూసీ జోక్యం చేసుకొని ఆ ప్రాజెక్టు జలవిద్యుత్ ప్రాజెక్టు కదా? వేరే నీటి అవసరాలు లేవుగా? అని ప్రశ్నించింది. దీంతో ఛత్తీస్‌గఢ్ స్పందిస్తూ.. ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు అని తెలిపింది. ఇచ్చంపల్లి బరాజ్‌తో నాలుగు గ్రామాలు, 170 హెక్టార్ల భూమి ముంపునకు గురి అవుతాయని పేర్కొంది.
వెంటనే పనులు చేపట్టాలి: తమిళనాడు
అనునంధానం ప్రాజెక్టుకు సమ్మతి తెలుపుతూ ఇప్పటికే సంతకాలు చేశామని, కావేరీ తీవ్ర లోటు బేసిన్ అని, తక్షణమే ప్రాజెక్టు పనులు చేపట్టాలని తమిళనాడు కోరింది. తమకు 24 టీఎంసీలు కాదని, 74 టీఎంసీలు కేటాయించాలని పుదుచ్చేరి విజ్ఞప్తి చేసింది.
గోదావరి నీటిని వాడుకోం: సీడబ్ల్యూసీ చైర్మన్
‘గోదావరి–కావేరీ అనుసంధానంలో భాగంగా గోదావరి జలాలు చుక్క కూడా వాడుకోము. హిమాలయన్ కాంపోనెంట్ నుంచి నీటిని తీసుకొచ్చి గోదావరిలో వేసి ఆ నీళ్లను తరలిస్తాం. రాష్ట్రాలన్నీ పెద్ద మనసుతో, ఉదార స్వభావంతో ఈ ప్రాజెక్టుకు అంగీకరించాలి. ప్రస్తుతం గోదావరిలో ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని 147 టీఎంసీల నీటిని తరలిస్తున్నాం. ఛత్తీస్‌గఢ్ గనుక తమ పూర్తి వాటా నీటిని వినియోగించుకునేందుకు వీలుగా ప్రాజెక్టులను నిర్మించుకుంటే తరలింపును నిలిపివేస్తాం. అయితే మరో 15 ఏళ్లయినా ఛత్తీస్‌గఢ్ తన వాటాను వాడుకునే అవకాశాల్లేవు..’ అని సీడబ్ల్యూసీ చైర్మన్ అతుల్‌కుమార్ జైన్ అన్నారు.