గుస్సాడీ నృత్యం అంటే తెలుసా!

Gussadi Dance: Telangana Adivasis Culture - Sakshi

దేవతా నాట్యం గుస్సాడీ!

ఆదివాసీ సంస్కృతికి ప్రతీక

ప్రాచీన నృత్యానికి వన్నె తెచ్చిన కనకరాజు

పద్మశ్రీ వరించడంతో ఈ కళకు మరింత ప్రాచుర్యం

సాక్షి, మంచిర్యాల: ఆదివాసీ గూడేల్లో మాత్రమే కనిపించే గుస్సాడీ నృత్యం ఒక విశిష్టమైన కళ. ఇది రాజ్‌ గోండు గిరిజనుల ప్రత్యేకం. ఈ నాట్య ప్రదర్శనలో అపార నైపుణ్యం గడించిన కనకరాజు సొంతూరు కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూరు మండలం మార్లవాయి గ్రామం. తమ సంస్కృతిని కొత్త తరానికి అందిస్తున్న గుస్సాడీ రాజు కనకరాజుకు పద్మశ్రీ దక్కడంతో ఆదివాసీ సమాజం హర్షిస్తోంది. ఈ ప్రాచీన నృత్యంపై మైదాన ప్రాంతాల్లోని వారికి అవగాహన తక్కువ. ఆదివాసీ సంప్రదాయాల్లో గుస్సాడీ ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది. వందల ఏళ్ల నుంచి ఈ ప్రాచీన దేవతా కళ తరతరాలు దాటుకుంటూ ప్రస్తుత రోబోటిక్‌ యుగంలోనూ కొనసాగుతోంది. ఈ నాట్యానికి మెరుగులు దిద్దడమేగాక నేటి తరానికి శిక్షణ ఇస్తూ.. మరింత గొప్ప కళగా మలిచారు కనకరాజు. ఈ కళ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు మహారాష్ట్రలోనూ ఉంది.  

పౌరాణిక గాథల్లో ప్రస్తావన..  
గుస్సాడీ నృత్యం ఆవిర్భావంపై అనేక పౌరాణిక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. గుస్సాడీ నాట్యం శివుడి ప్రతిరూపం, యత్మసూరు దేవత స్వరూపంగా.. ప్రకృతి ఆరాధనలో ఓ భాగమని ఆదివాసీ పెద్దలు చెబుతారు. తమ పూర్వీకులు అందించిన ఈ నృత్యానికి కాలక్రమేణా ఆదివాసీ ప్రముఖులు మరింత వన్నె తెచ్చారు. వీరిలో ఉట్నూరు ఐటీడీఏ ఏపీవోగా పనిచేసిన ఆదివాసీ ఐఏఎస్‌ మడవి తుకారాం విశేష కృషి చేశారు. 1940 దశకంలో రాజ్‌ గోండులపై అధ్యయనం చేసిన హైమన్‌ డార్ఫ్, ఆ తర్వాత 1978లో ఆదిలాబాద్‌కు వచ్చిన ఆయన శిష్యుడు మైకేల్‌ యోర్క్‌ తమ రచనల్లో, డాక్యుమెంటరీల్లో గుస్సాడీ ప్రత్యేకత వివరించారు.  

దండారీ ఉత్సవంలో... 
ఆదివాసీ గూడేల్లో దీపావళి పండుగకు వారం ముందు మొదలయ్యే దండారీ ఉత్సవాల్లో గుస్సాడీ ప్రదర్శనలు అమితంగా ఆకర్షిస్తాయి. పురుషులు మాత్రమే గుస్సాడీ వేషధారణ వేస్తారు. గుస్సాడీగా ఉన్న వ్యక్తి నిష్ఠతో దండారీ పూర్తయ్యే వరకూ కఠిన నియమాలు పాటించాలి. తలపై  నెమలి టోపీ (మాల్‌బూర), చేతిలో దండం (కర్ర), భుజానికి జింక తోలు, ఒళ్లంతా బూడిద, చేతికి పూసలు, రుద్రాక్షలు, కంకణాలు, గుబురు మీసాలు, గడ్డాలతో దీక్ష కొనసాగిస్తారు. వారం, పది రోజులు (దండారీ పూర్తయ్యే వరకు) స్నానం చేయరు. ఒక్కో నెమలి టోపీలో వెయ్యికి పైగా ఈకలు అమర్చుతారు. దీనిని నిపుణులతో చేయిస్తారు. కొందరు ఆడ వేషంలోనూ ఆకట్టుకుంటారు. నృత్యం చేసేప్పుడు సంప్రదాయ వాయిద్యాలైన తుడుం, పిప్రి, కాలికం, డప్పు, గుమెలా, ధోల్, వెట్టి, కర్ర (దండం)తో వాయిస్తూ.. ఎంతో రమణీయంగా పాడుతుంటారు. కష్ట సుఖాలు, సంతోషాన్ని ఆనందాన్ని నాట్యంలో వ్యక్తపరుస్తారు. సాధారణంగా ఈ నృత్యాన్ని దండారీలోనే ప్రదర్శిస్తుంటారు. కళ సాగేంతవరకు తమను తాము మైమరచి దైవత్వం కలిగి ఉంటారు. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి బృందంగా ఏర్పడి వెళతారు. గుస్సాడీలకు ఆతిథ్యం ఇచ్చిన గ్రామంలో మెప్పుపొందేలా వారి ప్రదర్శనలు ఉంటాయి. దండారీ ఉత్సవాల కోసం కొన్ని నెలల ముందే ఆదివాసీ గూడేలు సన్నద్ధమవుతాయి. 

చదవండి:
గుస్సాడీ కనకరాజును అభినందించిన మంత్రి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top