
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యాసంస్థల్లోకి మత్తు భూతం చొరబడిపోయింది. బాచుపల్లి మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. డ్రగ్స్ తీసుకుంటున్న విద్యార్థులను ఈగల్ టీం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇద్దరు విద్యార్థులతో సహా మొత్తం నలుగురిని నార్కోటిక్ బ్యూరో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మత్తుకు బానిసలైన మరో 50 మంది విద్యార్థులను విచారించేందుకు సిద్ధమైంది.
బహదూర్‌పల్లి బాచుపల్లి మహీంద్రా యూనివర్సిటీలో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్, గంజాయి దందా నడుస్తోంది. ఈ సమాచారంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్ విభాగం మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. గంజాయి సేవిస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. ఈ క్రమంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
మణిపూర్‌కు చెందిన ఓ విద్యార్థిని ఢిల్లీకి చెందిన ఓ ముఠా నుంచి కొరియర్ ద్వారా ఓజీ కుష్ డ్రగ్‌ను తెప్పించుకుంటున్నాడు. దానిని గంజాయితో కలిపి సిగరెట్లు తయారు చేసి మిగతా స్టూడెంట్స్‌కు విక్రయిస్తున్నాడు. దీంతో సదరు విద్యార్థిని మరో విద్యార్థితో పాటు ఇద్దరు డగ్ర్ పెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల నుంచి కిలోకి పైగా గంజాయి, 47 ఓజీ కుష్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులు వీటికి బానిసలైనట్లు గుర్తించారు. ఈ పరిణామంపై కాలేజీ యాజమాన్యం స్పందించాల్సి ఉంది.