మీ పంచాయితీల్లోకి మమ్మల్ని లాగొద్దు | CM Revanth Reddy comments regarding KCR family | Sakshi
Sakshi News home page

మీ పంచాయితీల్లోకి మమ్మల్ని లాగొద్దు

Sep 4 2025 4:29 AM | Updated on Sep 4 2025 4:29 AM

CM Revanth Reddy comments regarding KCR family

బచ్చల నర్సమ్మ ఇంటి వద్ద ఆమె కుటుంబంతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి, వాకిటి శ్రీహరి, ఎంపీ రఘురాంరెడ్డి తదితరులు

ఏదైనా ఉంటే కుటుంబంలోకూర్చొని మాట్లాడుకోండి.. 

కుల పెద్ద దగ్గరకు వెళ్లండి.. కుదరకపోతే మంత్రగాని దగ్గరకు పోండి  

కేసీఆర్‌ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

ఒకప్పుడు రాష్ట్రంలోఏ పార్టీ కూడాఉండకూడదని చూశారు 

ఇప్పుడు కడుపులో కత్తులు పెట్టుకునికౌగిలించుకుంటున్నారు 

తాను తెలంగాణ ప్రజల వెనుక ఉంటానని వెల్లడి 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మఇళ్ల గృహప్రవేశం  

సాక్షి ప్రతినిధులు, భద్రాద్రి కొత్తగూడెం/మహబూబ్‌నగర్‌: ‘ఏమైనా సమస్యలు ఉంటే కుటుంబంలో కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోండి.. కాదంటే కుల పెద్ద దగ్గరకు వెళ్లండి.. అదీ కుదరకపోతే మంత్రగాన్ని సంప్రదించండి. అంతేతప్ప మీ గొడవల మధ్యకు మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు? ఒకప్పుడు రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఉండకూడదని చూశారు. అక్రమ కేసులు పెట్టి ఎంతోమందిని జైళ్లకు పంపించారు. ఇప్పుడు వాళ్లకు వాళ్లే కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారు. నేను హరీశ్‌రావు, సంతోష్‌రావు వెనుక ఉన్నానని ఒకరు.. కవిత వెంట ఉన్నానని మరొకరు అంటున్నారు. 

పదేళ్లలో దోచుకున్న అవినీతి సొమ్మును పంచుకోవడానికి వాళ్లు కొట్లాడుకుంటున్నారు. ఆ చెత్తగాళ్ల వెనుక నేనెందుకుంటా? మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించారు. నేను నాయకుడిని.. ఉంటే ముందే ఉంటా. పాలమూరు వెనుక, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా. వారికి తోడుగా ఉంటా. ప్రజల అభివృద్ధికి కృషి చేస్తా. మీ కుటుంబ, మీ కుల పంచాయితీల్లోకి మమ్మల్ని లాగొద్దు. మాకు ఎలాంటి ఆసక్తి లేదు..’ అని మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 

బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడులో ఆయన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం నిర్వహించారు. అనంతరం దామరచర్లలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. అలాగే మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలం వేముల శివారులోని ఎస్‌జీడీ ఫార్మా కార్నింగ్‌ టెక్నాలజీస్‌ రెండవ యూనిట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

చచ్చిన పామును నేనెందుకు చంపుతా..
లక్షల కోట్లు దోచుకున్న నాయకుని ఇంట్లో ఈ రోజు నోట్ల కట్టల కోసం పొడుçచుకుంటున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్లకు ఫామ్‌హౌస్‌లు, టీవీ చానళ్లు, వార్తా పత్రికలు, బంగ్లాలు ఎన్నో ఆస్తులు సంపాదించి ఇచ్చాడు. కానీ ఈ రోజు ఆ ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. 

కుటుంబ సభ్యులే ఒకరితో ఒకరు కొట్లాట పెట్టుకుంటున్నారు. ఆ గొడవల వెనక మనం ఉన్నామంటున్నారు. 2023 డిసెంబర్‌లోనే ఆ కాలనాగును తెలంగాణ ప్రజలు కర్రలతో కొట్టారు. అది ప్రజలను దోచుకుంటున్న అనకొండ అని పెద్ద బండరాయితో తలమీద కొట్టి బొంద పెట్టారు. ఆ చచ్చిన పామును నేను ఎందుకు చంపుతాను.

ప్రకృతి శిక్షిస్తూనే ఉంటుంది..
ఒకప్పుడు జనతాపార్టీకి గొప్ప పేరు ఉండేది. అది కనుమరుగైంది. కొంతమంది కుట్రల వల్ల తెలుగుదేశం పార్టీ తెలంగాణలో సమస్యను ఎదుర్కొంటోంది. ఇన్ని దుర్మా ర్గాలు చేసిన మీరు ఎట్లా మనుగడ సాగిస్తారు? ప్రకృతి అనేది ముందుంది.. అది శిక్షిస్తూనే ఉంటుంది. చేసిన పాపా లు వెంటాడుతూనే ఉంటాయి. అనుభవించి తీరాల్సిందే. 

శీనన్నపై నా అంచనాలు తప్పలేదు
ఈ రోజు నాయకపోడు మహిళ రమణమ్మకు చెందిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆమె కళ్లలో కనిపించిన ఆనందం చూస్తుంటే.. గతంలో జూబ్లీహిల్స్‌లో డూప్లెక్స్‌ ఇల్లు కట్టుకున్నప్పుడు నేను పడిన సంతోషం గుర్తుకొచ్చింది. ఆ సంతోషం డబ్బుతో వచ్చేది కాదు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు నాకు బలమైన మనిషి అవసరం పడింది. అందుకే హైకమాండ్‌ దగ్గర పట్టుబట్టి మరీ గృహ నిర్మాణ శాఖను పొంగులేటి శీనన్నకు కేటాయించా. 

నా అంచనాలు తప్పలేదు.. ఢిల్లీ ముందు తలదించుకోవాల్సిన అవసరం లేకుండా అప్పగించిన పనిని 99.99 శాతం శీనన్న నెరవేరుస్తాడనే నమ్మకం ఉంది. వైఎస్సార్‌ హయాంలో 2004లో మొదలైన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా 20 లక్షల ఇళ్లు  కట్టించాం. హనుమాన్‌గుడి లేని ఊరు ఉంటుందేమో కానీ ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు ఉండదు.

పాలమూరును చూడటానికి విదేశీయులు రావాలి
ఒకప్పుడు పాలమూరులో మన కరువును, పేదరికాన్ని, వెనుకబాటుతనాన్ని చూపించడానికి అప్పటి ముఖ్యమంత్రు లు విదేశాల నుంచి పర్యాటకులు, ప్రెసిడెంట్లను తీసుకొచ్చా రు. టోనీబ్లెయిర్‌ వచ్చిండంటే మన పేదరికం ఎగ్జిబిషన్‌గా ఉండే. ఇప్పుడు ప్రజలు, మన సాగునీటి ప్రాజెక్టులు, విద్యావసతులు చూడడానికి విదేశాల నుంచి రావాలి. దేవరకద్ర ఎమ్మెల్యే కోరినట్లు డ్రైపోర్టు ఏర్పాటు అంశాన్ని పరిగణనలోకి తీసుకొంటాం. విదేశాల నుంచి మేధావులు ఇక్కడి ట్రిపుల్‌ ఐటీని చూసేందుకు రావాలి.

దత్తత గ్రామానికే న్యాయం చేయలేదు: మంత్రి పొంగులేటి
దామరచర్ల సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ..ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వాసాలమర్రి గ్రామాన్ని సీఎం హోదాలో కేసీఆర్‌ దత్తత తీసుకున్నారని, ఆ గ్రామంలో ఓ 90 ఏళ్ల అవ్వకు ఇల్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చి నిలుపుకోలేదని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం ఆ అవ్వకు ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇచ్చిందని తెలిపారు. 

గృహ ప్రవేశం చేసి.. పట్టు వస్త్రాలు అందజేసి..
సీఎం బెండాలపాడు చేరుకోగానే స్థానికులు ఆయనకు కొమ్ముకోయ నృత్యాలతో స్వాగతం పలికారు. నాయక్‌పోడు మహిళ బచ్చల రమణ ఇంటికి సీఎం వెళ్లారు. రిబ్బన్‌ కట్‌ చేసి లోపలికి వెళ్లి అన్ని గదుల్లో కలియదిరిగారు. దేవుడి పటాల ముందు జ్యోతి వెలిగించి కుటుంబ సభ్యులకు పట్టు వస్త్రాలు అందజేశారు. 

ఇంటి ఆవరణలో మొక్కలకు నీరు పోశారు. అనంతరం కుటుంబ సభ్యులతో గ్రూప్‌ ఫొటో దిగారు. ఆ తర్వాత బచ్చల నర్సమ్మ ఇంటి గృహప్రవేశంలో సీఎం పాల్గొన్నారు. ముందు గదిలో చాపపై కూర్చుని మిఠాయిలు తిన్నారు. ఇంటి యజమానురాలి మనవరాలికి పాయసం తినిపించారు. వారికి వస్త్రాలు అందజేసి గ్రూప్‌ ఫొటో దిగారు. కాగా సీఎం రేవంత్‌రెడ్డిని, మంత్రి పొంగులేటిని ఇందిరమ్మ ఇంటి యజమానులు సత్కరించారు.

మీ పిల్లలకు కొరియా, జపాన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తా 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి  
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘ఐటీ చదివిన వారు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అందరికీ ఐటీ కోర్సులు చదివే అవకాశం రాకపోవచ్చు. సాధారణ విద్యతోనే సరిపెట్టుకోవాల్సి రావొచ్చు. ఇ లాంటి వారికి కూడా ఏటీసీలతో స్కిల్స్‌ నేర్పించి సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఉద్యోగం చేసే అవకాశాన్ని మా ప్రభుత్వం కల్పిస్తుంది’అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 

దామరచర్ల సభలో రేవంత్‌ బుధవారం మాట్లాడుతూ.. గత సీఎం ప్రజలను గొర్రెలు కాసుకోమని, చేపలు పట్టుకోమని, చెప్పులు కుట్టుకోమని చెప్పి.. ఆయన పిల్లలను రాజ్యాలు ఏలాలి, ప్రజా సంపద దోచుకోవాలని చెప్పారని విమర్శించారు. తమ ప్రభుత్వం అలా ఉండదని, పేదరికం రూపుమాపే, తలరాతను మార్చే శక్తి ఉన్న విద్యను అందించడంపై దృష్టి పెడుతోందని తెలిపారు. కొందరు నాయకులకు పేదరికం ఎక్స్‌కర్షన్‌ వంటిదని, కానీ తనతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేదరికంలోనే పుట్టి, అందులోనే పెరిగామని చెప్పారు. అది తమ జీవన విధానంలో ఓ భాగమని అన్నారు.   

తల్లులూ సంతోషంగా ఉన్నారా?!
చండ్రుగొండ: ‘తల్లులూ.. సంతోషంగా ఉన్నారా? మేం వచ్చాక రేషన్‌కార్డులు, సన్న బియ్యం ఇచ్చాం.. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం.. మీ ఊర్లో ఎందరికి ఇళ్లు వచ్చాయి?’అని చండ్రుగొండ మండలం బెండాలపాడులో గృహప్రవేశాల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మహిళలను ఆరా తీశారు. సీఎం ప్రశ్నకు మహిళలంతా ముక్తకంఠంతో 310 మందికి వచ్చాయని సమాధానం చెప్పారు. దీంతో సీఎం స్పందిస్తూ ‘మీ కళ్లల్లో సంతోషమే మీరు ఎంత ఆనందంగా ఉన్నారో చెబుతోంది’అని అన్నారు. 

మీ ఇంటి మంత్రి ఎవరు? అని సీఎం ప్రశ్నించగా.. ఆదివాసీ మహిళలు ‘పొంగులేటి అన్న’అని చెప్పారు. ‘దివంగత సీఎం వైఎస్‌.రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఇళ్లు కట్టుకుంటే.. మళ్లీ ఇప్పుడు ఇళ్ల నిర్మాణాలతో కళ కనిపిస్తోంది’అని సీఎం తెలిపారు. బెండాలపాడులో బచ్చల రమణ, బచ్చల నరసమ్మ ఇళ్ల గృహప్రవేశాలు చేయించిన సీఎం పూజ చేశారు.  

ఇల్లు రావడమే గొప్ప అనుకున్నాం.. 
ఇందిరమ్మ ఇల్లు రావడమే గొప్ప అనుకున్నా. అలాంటిది ఇంటి నిర్మాణం పూర్తి కావడం.. స్వయంగా ముఖ్యమంత్రి మాకు బట్టలు పెట్టి గృహప్రవేశం చేయించడాన్ని నమ్మలేకపోతున్నాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం మేలు మరిచిపోలేము. సీఎం సార్‌ను శాలువాతో సన్మానించాం. నా కూతురు ఝాన్సీ, ఆమె బిడ్డ వెన్సికతో సీఎం మాట్లాడి పేర్లు అడిగారు.   – బచ్చల నరసమ్మ, లబ్దిదారు, బెండాలపాడు 

ఈ సంతోషం మాకెప్పటికీ పదిలం 
రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా మా ఇంటికి వచ్చి మాతో గృహప్రవేశం చేయించడం ఆనందంగా ఉంది. ఈ సంతోషాన్ని జీవితకాలం పదిలంగా గుండెల్లో దాచుకుంటాం. మా ఇంట్లో సీఎం రేవంత్‌రెడ్డి పూజ చేశారు. మేము వండిపెట్టిన పాయసం, గారెలు తిన్నారు. ఇలాంటి పాలన ఉంటే పేదల బతుకులు మారినట్లే.  – బచ్చల రమణ, లబి్ధదారు, బెండాలపాడు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement