
ప్రేమికుల ఇతివృత్తంతో మైనర్
తమిళసినిమా: అరబి ప్రొడక్షన్స్, వియన్ వెంచర్స్, మేడే ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న చిత్రం మైనర్. ఇంతకు ముందు ఫైండర్ చిత్రాన్ని తెరకెక్కించిన వినోద్ రాజేంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీలంక ర్యాప్ సింగర్ వాగీశన్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. బిగ్‌బాస్ ఫేమ్ జనని నాయకిగా నటిస్తున్న ఇందులో చార్లీ, సెండ్రాయన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఈతరం ప్రేమికుల నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందన్నారు. పాఠశాల దశలో ప్రేమించిన యువతిని వదిలి వెళ్లిపోయిన యువకుడు మళ్లీ ఆమెను వెతుక్కుంటూ వెళతాడన్నారు. అయితే వారు మళ్లీ కలిశారా? వారి ప్రేమ ఫలించిందా ? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్ర కథ సాగుతుందన్నారు. కాగా చిత్ర పూజా కార్యక్రమాలను బుధవారం నిర్వహించినట్లు, రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే చైన్నె, పాండిచ్చేరి ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా దీనికి రెజీ సెల్వరాసా చాయాగ్రహణం, ఆర్.సూర్య ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.