
రంగనాథ స్వామి ఆలయం వద్ద మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న కమాండోలు
సాక్షి, చైన్నె: శ్రీరంగనాథుడి ఆలయంలో భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి పెడుతూ మాక్ డ్రిల్ మంగళవారం వేకువ జామున నిర్వహించారు. అయిత్ బ్లాక్ కమాండోల హడావుడితో ఆ పరిసర వాసులలో కలకలం రేగింది. చివరకు మాక్ డ్రిల్ అని తేలడంతో భక్తులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు.. తిరుచ్చి జిల్లా శ్రీరంగం అంటే అందరికీ గుర్తుకు వచ్చేది శ్రీరంగనాథ స్వామి ఆలయం. 108 వైష్టవ క్షేత్రాల్లో ఒకటిగా ఈ ఆలయానికి విశిష్ట చరిత్ర ఉంది. ప్రధానంగా అతి పెద్ద ప్రాకారంతో 156 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంటుంది. ఏడు ప్రాకారాలు, 21 గోపురాలతో ఈ ఆలయం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. అలాగే ప్రధాన సన్నిధితో పాటు 54 ఉప సన్నిధులు ఇక్కడ ఉన్నాయి. ఇంతటిప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో భద్రతను కట్టుదిట్టం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇక్కడ భద్రతా చర్యలు ఏ మేరకు ఉన్నాయో పసిగట్టే విధంగా మాక్ డ్రిల్ నిర్వహించారు.
ఉత్కంఠగా..
మంగళవారం వేకువ జామున ఒంటి గంట సమయంలో శ్రీరంగం వైపుగా పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు దూసుకెళ్లారు. శ్రీరంగనాథ స్వామి ఆలయం వైపుగా వాహనాల ఆగడంతో ఉత్కంఠ నెలకొంది. 30 మంది పోలీసులు, మరో 200 మందితో కూడిన బ్లాక్ కమాండోలు హడావుడిగా పరుగులు తీయడంతో స్థానికులు ఉలిక్కి పడి లేచారు. ఆలయం ఆవరణలో ఏదో జరుగుతోందనే ఉత్కంఠ నెలకొంది. తీవ్రవాదులు ఎవరైనా చొరబడ్డారా..? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. వచ్చిన కమాండోలు ఆలయంలోకి దూసుకెళ్లడంతో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. తుపాకీ, బాంబుల దాడి శబ్దాలను తలపించే ఘటనలు జరగడంతో జనం అంతా ఆలయం వైపుగా పరుగులు తీశారు. అయితే, ఇది మాక్ డ్రిల్ అని, ఆలయ భద్రతకు ప్రత్యేక చర్యలపై దృష్టి పెట్టినట్టు పోలీసు అధికారులు పేర్కొనడంతో గుమికూడిన జనం తమ ఇళ్లకు వెళ్లారు.
బ్లాక్ కమాండోల హడావుడితో కలకలం