
ఆస్పత్రిలో ఈవీకేఎస్
● తొమ్మిదిమందికి తీవ్ర గాయాలు
అన్నానగర్: పుదుకోటై సమీపంలో మంగళవారం రాత్రి రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతిచెందారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పుదుకోటై జిల్లా అరంతాంగి ఎంజీఆర్ నగర్‌కు చెందిన మణికంఠన్ (28) మంగళవారం ఉదయం తన తల్లి వళ్లియమ్మాళ్ (48), భార్య నీలవేణి (25), కుమార్తె మహిషశ్రీ (12), అత్త సుమతి (45)లతో కలిసి సేలంలోని మారియమ్మన్ ఆలయానికి వెళ్లి తిరగి వస్తున్నా రు. అదేసమయంలో రామేశ్వరం నుంచి సేలం వైపు ఆరుగురు కారులో వస్తున్నారు. రాత్రి 10.15 గంటల సమయంలో తిరుచ్చి – పుదుకోటై రోడ్డులోని భారతీదాసన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సమీపంలో రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని మాత్తూరు పోలీసులు తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ అరంతాంగికి చెందిన కదీర్ (28), సుమతి, మహిషశ్రీ మృతి చెందారు. మిగిలిన 9 మంది చికిత్స పొందుతున్నారు.
భార్య మృతిని తట్టుకోలేక
భర్త ఆత్మహత్య
అన్నానగర్: కంబం సమీపంలో ప్రసవ సమయంలో భార్య మృతిచెందడంతో భర్త బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తేని జిల్లా కంబం స్వామి వివేకానంద వీధికి చెందిన ఆసై పాండియన్ కుమారుడు రాజ్‌కుమార్ (23) తల్లిదండ్రులు కుటుంబ సమస్యల కారణంగా విడిపోయారు. ఆసై పాండియన్ మరో మహిళను రెండో పెళ్లి చేసుకుని ఊటీలో ఉంటున్నాడు. రాజ్‌కుమార్‌ను అతని తాత సోలైరాజ్ పెంచారు. రాజ్‌కుమార్ తాను పని చేస్తున్న కంపెనీలో దేవరం బొమ్మినాయగకన్ పట్టికి చెందిన ఆంథోనియమ్మాళ్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ నెల 13వ తేదీన రాజ్‌కుమార్ తాత చోలైరాజ్ అనారోగ్యంతో మృతి చెందారు. గర్భిణి అయిన ఆంథోనియమ్మాళ్‌కు ప్రసవ నొప్పులు రావడంతో కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. 17న ప్రసవం కష్టమై ఆమె మృతి చెందింది. తనను పెంచి పెద్ద చేసిన తాత, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య చనిపోవడంతో రాజ్‌కుమార్ తట్టుకోలేకపోయాడు. బుధవారం ఇంటిలో ఉరివేసుకున్నాడు. ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో బంధువులు తలుపులు పగులగొట్టి చూడగా రాజ్‌కుమార్ ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. కంబం నార్త్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రాజ్‌కుమార్ మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తల్లి మందలించిందని
విద్యార్థి ఆత్మహత్య
అన్నానగర్: పొల్లాచ్చిలో తల్లి మందలించిందని 8వ తరగతి విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి అన్సారీ వీధికి చెందిన శరవణబాబు, విజయలక్ష్మి దంపతులకు కుమారుడు తరుణ్ (13) ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. బాలుడు మంగళవారం సాయంత్రం టీవీ చూస్తుండడంతో తల్లి మందలించింది. తర్వాత ఆమె వేరే చోటికి వెళ్లింది. తిరిగి వచ్చి చూడగా ఇంటి తలుపులు వేసి ఉన్నాయి. తలుపులు పగులగొట్టి చూడగా తరుణ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. అతన్ని పొల్లాచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆరోగ్యంగానే ఉన్నా!
● వీడియో విడుదల చేసిన ఈవీకేఎస్
సాక్షి, చైన్నె: తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఈరోడ్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత ఈవీకేఎస్ ఇలంగోవన్ బుధవారం వీడియో విడుదల చేశారు. ఈ ఏడాది జనవరిలో ఈవీకేఎస్ తనయుడు తిరుమగన్ గుండెపోటుతో మరణించాడు. దీంతో ఈరోడ్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. ఈవీకేఎస్ విజయకేతనం ఎగుర వేశారు. ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినా అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. గత వారం గుండెపోటు రావడంతో పోరూర్‌లోని శ్రీరామచంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆయనకు కరోనా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం కరోనా నుంచి ఆయన కోలుకున్నారు. కాగా తాను ఆరోగ్యంగానే ఉన్నానని, త్వరలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి.. ప్రజాసేవకు అంకితం అవుతానని నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఆయన ఓ వీడియో విడుదల చేశారు.