
వెంకట్ పుదియవన్ చిత్రంలో ఓ దృశ్యం
తమిళ సినిమా: సినిమాలో ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేసే అంశాల్లో ఫైట్స్ సన్నివేశాలు ఒకటి. అలాంటి ఫైట్ మాస్టర్ సినిమాకు దర్శకత్వం వహిస్తే కచ్చితంగా ఆ చిత్రంలో పోరాట దృశ్యాలు హైలైట్‌గా ఉంటాయి అని చెప్పవచ్చు. జయంత్ తాజాగా దర్శకుడిగా మెగాఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న చిత్రం వెంకట్ పుదియవన్. బీఎం మూవీస్ పతాకంపై వెంకటేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకట్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. కథానాయకిగా శిల్ప నటిస్తున్న ఇందులో అళగు, మీసై రాజేంద్రన్, వెంకట్రావ్, దశరదన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాలను చూసి ఎదిరించే పోలీస్ అధికారి పాత్రలో నటుడు వెంకట్ నటిస్తున్నారని, అతను ఆ పాత్రకు చక్కగా న్యాయం చేస్తున్నారని చెప్పారు. ఈయన ఇంతకుముందే ఒక కన్నడ చిత్రంలో నటించినట్లు చెప్పారు. ఈ చిత్రం ద్వారా తమిళంలోకి పరిచయమవుతున్నారని తెలిపారు. వెంకట్ పుదియవన్ చిత్రంలో 7 ఫైట్ సన్నివేశాలు ఉంటాయన్నారు. కథ డిమాండ్ మేరకే ఈ పోరాట దృశ్యాలు చోటు చేసుకుంటాయన్నారు. పెద్ద మనుషులుగా చెలామణి అయ్యే వారి అక్రమాలు, యువతుల కిడ్నాప్ వంటి దుర్మార్గాలకు పాల్పడే వారి ఆట కట్టించే విఇధంగా చిత్రం రూపొందినట్లు పేర్కొన్నారు. దీనికి పీటర్ ఛాయాగ్రహణం, విశాల్ త్యాగరాజన్ సంగీతాన్ని అందిస్తున్నారని తెలిపారు.