49 క్లస్టర్ కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ
భానుపురి (సూర్యాపేట), మునగాల : రెండో విడత పంచాయతీ ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా 49 క్లస్టర్ కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. ఆదివారం సూర్యాపేట మండలం ఇమాంపేట, మునగాల మండల కేంద్రంతోపాటు బరాఖత్‌గూడెంలో నామినేషన్ కేంద్రాలను సందర్శించారు. నామినేషన్ల ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల వద్ద కలెక్టర్ మాట్లాడుతూ పెన్‌పహాడ్, చివ్వెంల, మోతె, మునగాల, నడిగూడెం, కోదాడ, చిలుకూరు, అనంతగిరి మండలాల్లోని 181 పంచాయతీలు, 1,628 వార్డులకు నేటి నుంచి ఈ నెల 2వ తేదీ వరకు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. ఈనెల 14న పోలింగ్ జరగునుందన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా ఎన్నికల ప్రవర్తన నియమావళిని అందరూ పాటించాలని కోరారు. అభ్యర్థులు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ పత్రాలు సమర్పించాలన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సూర్యనారాయణ, ఎంపీడీఓలు బాలకృష్ణ, రమేష్ దీన్‌దయాళ్, మాల్సుర్‌నాయక్, ఆర్‌ఓలు, ఎంపీఓలు, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


