నియమావళికి లోబడి నడుచుకోవాలి
ఫ ఎస్పీ నరసింహ
అర్వపల్లి: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు, నాయకులు నియమావళికి లోబడి నడుచుకోవాలని జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. శనివారం జాజిరెడ్డిగూడెం, కుంచమర్తి గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. గొడవలు, విభేదాలకు పోకుండా ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. ఎన్నికల సమయంలో సమస్యలు సృష్టించకుండా పాత నేరస్తులు, గతంలో సమస్యలు సృష్టించిన వారిని రూ.5లక్షల పూచీకత్తుపై బైండోవర్ చేస్తున్నట్లు తెలిపారు. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు నాగేశ్వరరావు, రామారావు, స్థానిక ఎస్‌ఐ ఈట సైదులు, స్థానిక దేవస్థాన చైర్మన్ అనిరెడ్డి రాజేందర్‌రెడ్డి, వజ్జె వీరయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.


