30న ఉమ్మడి జిల్లా స్థాయి ఆర్చరీ ఎంపిక పోటీలు
భువనగిరి : ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి ఆర్చరీ ఎంపిక పోటీలు ఈ నెల 30న నిర్వహిస్తున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీగిరి విజయకుమార్‌రెడ్డి, తునికి విజయసాగర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్‌లో నిర్వహించే పురుషులు, మహిళల ఎంపీక పోటీలకు ఆసక్తి కలిగిన క్రీడాకారులు తమ వెంట ఆధార్‌కార్డుతో పాటు జనన ధ్రువీకరణ పత్రాలను తీసుకుని ఉదయం 10 గంటలకు వరకు హాజరై వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు కోచ్ సంపత్‌ను 9182842387లో సంప్రదించాలని కోరారు.
అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలి
మద్దిరాల : నామినేషన్ కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకుడు రవినాయక్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం మద్దిరాల మండల కేంద్రంలోని నామినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీఐ నరసింహ, ఎంపీడీఓ సత్యనారాయణరెడ్డి, తహసీల్దార్ అయేషా పర్వీన్, ఎస్‌ఐ ఎం.వీరన్న, పీఓ, ఆర్‌ఓ, సిబ్బంది ఉన్నారు.
వరికొయ్యలను కాల్చొద్దు
మునగాల: పొలాలు కోసిన అనంతరం రైతాంగం వరికొయ్యలను కాల్చొద్దని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) శ్రీధర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం మునగాల మండల కేంద్రంలో వరికొయ్యలను కాల్చిన పలువురి రైతుల వ్యవసాయ భూములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వరికోతల తర్వాత మిగిలిన వరికొయ్యలు, గడ్డిని త్వరగా తొలగించేందుకు తగులబెట్టడం సాధారణమైందని, ఈ పద్ధతి వల్ల నేలకు, పంటకు, మన ఆరోగ్యానికి ఎంతో నష్టం జరుగుతుందన్నారు. నేల భూసారాన్ని కోల్పోతుందని, గాలిలో కాలుష్యం పెరగుతుందని, ఎరువుల ఖర్చు పెరుగుతుందని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఓ బి.రాజు, ఏఈఓలు నాగు, రమ్య, భవాని, మహిత, రైతులు పాల్గొన్నారు.
భవిష్యత్ అంతా సైన్స్‌దే..
సూర్యాపేట టౌన్ : రేపటి భవిష్యత్ అంతా సైన్స్‌దేనని జన విజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ అందె సత్యం అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకులంలో ఆ వేదిక జిల్లా అధ్యక్షుడు గోళ్లమూడి రమేష్ బాబు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల్లో ఆయన మాట్లాడారు. నాలుగు విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమొంటోలు, పుస్తకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో విద్యా శాఖ సెక్టోరియల్ అధికారులు శ్రవణ్‌కుమార్, రాంబాబు, సూర్యనారాయణలు ప్రిన్సిపాల్ జీవీ.విద్యాసాగర్, డాక్టర్ విజయమోహన్, షేక్ జాఫర్, కలకుంట్ల సైదులు, డీఎన్ స్వామి, యాదయ్య, రామచంద్రయ్య, దయానంద్, సోమ సురేష్, క్రాంతికుమార్ పాల్గొన్నారు.
విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలి
నడిగూడెం: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని వాటి సాధనకు క్రమశిక్షణతో చదవాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల డీసీఓ సీహెచ్.పద్మ కోరారు. శుక్రవారం నడిగూడెం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులాన్ని తనిఖీ చేశారు. అనంతరం 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి, వైస్ ప్రిన్సిపాల్ విజయశ్రీ, సునిత, విద్యార్థులు పాల్గొన్నారు.
30న ఉమ్మడి జిల్లా స్థాయి ఆర్చరీ ఎంపిక పోటీలు


