ఎలాంటి ఘర్షణలకు తావివ్వొద్దు
సూర్యాపేట : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు క్షణికావేశంలో ఘర్షణకు దిగి కేసుల పాలు కావొద్దని జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. శుక్రవారం డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ రాజశేఖర్, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ రవితో కలిసి సూర్యాపేట మండలం యర్కారం గ్రామంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. ఎన్నికల నియమావళిని పాటించాలని ప్రజలకు సూచించారు. ఓటర్లంతా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి పోలీస్ శాఖ పూర్తి భద్రత, రక్షణ కల్పిస్తుందన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేలా డబ్బు, బహుమతులు, మద్యం, ఇతర ఉచితాలు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని, ఫలితాలు వెలువడిన రోజు ఎవరు కూడా ర్యాలీలు నిర్వహించొద్దన్నారు. అక్రమ రవాణా నిరోధం కోసం 24 గంటలకు తనిఖీలు ఉంటాయి అన్నారు. అంతరాష్ట్ర చెక్ పోస్టుల్లో పటిష్ట నిఘా ఉంచామన్నారు. ఆకస్మిక తనిఖీలకు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, ఎస్‌ఐలు బాలునాయక్, శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ


