జిల్లాకు ఇద్దరు పరిశీలకులు
భానుపురి(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లాకు పంచాయతీ ఎన్నికల కోసం ఇద్దరు పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించింది.వీరిలో సాధారణ పరిశీలకుడిగా గుగులోతు రవి నాయక్, వ్యయ పరిశీలకుడిగా హుస్సేన్ ఉన్నారు.
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి గురువారం నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం రక్తి కట్టించారు. అనంతరం విష్వక్సేనారాధన , పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ,తలంబ్రాలతో కల్యాణతుంతు ముగించారు. ఆలయ తిరుమాడ వీధుల్లో శ్రీస్వామి వారిని గరుడవాహనంపై ఊరేగించారు. అనంతరం మహానివేదనతో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, అర్చకులుపాల్గొన్నారు.
బహిరంగ వేలం వాయిదా
మట్టపల్లి క్షేత్రంలో కొబ్బరికాయలు అమ్ముకునే హక్కుకోసం గురువారం స్తానికంగా నిర్వహించిన బహిరంగ వేలానికి సరైన పాటదారులు పాల్గొనక పోవడంతో వాయిదా వేస్తున్నట్లు ఆలయ ఈఓ బి.జ్యోతి తెలిపారు. త్వరలోనే మళ్లీ బహిరంగ వేలం నిర్వహిస్తామని చెప్పారు.
56 సర్పంచ్
స్థానాల్లో పోటీ
సూర్యాపేట అర్బన్ : పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ జిల్లాలోని 56 సర్పంచ్ స్థానాల్లో పోటీ చేస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి వెల్లడించారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవసరమైన చోట వామపక్షాలతో కలిసి ముందుకు సాగుతామన్నారు. మతోన్మాద బీజేపీని ఓడించేందుకు లౌకిక పార్టీలతో అవగాహన చేసుకుంటామన్నారు. ప్రస్తుతం చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. సర్పంచ్‌గా పోటీ చేయని గ్రామాలలో బీజేపీయేతర పార్టీలతో కలిసి సర్దుబాటు చేసుకుంటామన్నారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపెళ్లి సైదులు, చెరుకు ఏకలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు కందాల శంకర్ రెడ్డి, పులుసు సత్యం, వేల్పుల వెంకన్న, జె.నరసింహారావు, నాయకులు గుమ్మడవెల్లి ఉప్పలయ్య, మే రెడ్డి కృష్ణారెడ్డి, పోలోజుసైదులు, బత్తుల జనార్దన్ పాల్గొన్నారు.
కొనసాగుతున్న
మూసీ నీటి విడుదల
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు గురువారం ఎగువ నుంచి 724 క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. రిజర్వాయర్‌లో పూర్తిస్థాయిలో నీటి నిల్వ ఉండడంతో అధికారులు వరదను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు ఒక క్రస్టు గేటును అడుగున్నర మేర పైకెత్తి 988 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 44 క్యూసెక్కులు సీపేజీ, లీకేజీ, ఆవిరి రూపంలో తగ్గుతోంది. ఈఏడాది మొదటిసారిగా జూలై మాసంలో మూసీ గేట్లను అధికారులు పైకెత్తగా.. నాటి నుంచి నిర్విరామంగా దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. 62 ఏళ్ల మూసీ చరిత్రలో ఇన్నిరోజులపాటు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి.
జిల్లాకు ఇద్దరు పరిశీలకులు
జిల్లాకు ఇద్దరు పరిశీలకులు


