ఓట్ల జాతర
తొలి విడత ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
సూర్యాపేట : సంగ్రామానికి వేళయ్యింది. మొదటి విడత ఎన్నికలు జరిగే పంచాయతీలకు సంబంధించి గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇదే రోజు క్లస్టర్ గ్రామాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జిల్లాలోని ఎనిమిది మండలాల్లోని 159 గ్రామాలతో పాటు 1,442 వార్డుల్లో డిసెంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు.
44 క్లస్టర్ల ఏర్పాటు
తొలివిడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికలు జరిగే గ్రామాలలో నాలుగైదు ఊళ్లకు ఒక క్లస్టర్ చొప్పున మొత్తం 44క్లస్టర్లను ఏర్పాటు చేశారు. నామినేషన్ల స్వీకరణకు అవసరమయ్యే ఎన్నికల సామగ్రి అంతా జిల్లా కేంద్రం నుంచి ఆయా గ్రామాలకు చేరింది. కలెక్టర్ నేతృత్వంలో ఆర్వోలు, ఏఆర్వోలు, ఎంపీడీఓలకు బుధవారం శిక్షణ కూడా పూర్తి చేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమై ఈనెల 29వ తేదీ వరకు కొనసాగుతుంది. 30న నామినేషన్ల పరిశీలన, అదే రోజు సాయంత్రం అర్హత కలిగిన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. దీని పై డిసెంబర్ 1న అభ్యంతరాలు స్వీకరించి, 2న పరిష్కరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ డిసెంబర్ 3న ఉంటుంది. కాగా అదే రోజు ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తుది జాబితా వెల్లడించి గుర్తులు కేటాయిస్తారు. మొదటి విడత ఎన్నికలు డిసెంబర్ 11న జరగనుండగా మధ్యాహ్నం తర్వాత ఫలితాలు వెల్లడించనున్నారు.
ఎనిమిది మండలాల్లో
తొలివిడత ఎన్నికలు ఆత్మకూరు(ఎస్), జాజిరెడ్డిగూడెం, మద్దిరాల, నాగారం, నూతనకల్, సూర్యాపేట, తిరుమలగిరి, తుంగతుర్తి మండలాల్లోని 159 గ్రామాలు, 1,442 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
మండలాలు : 08
గ్రామాలు: 159
వార్డులు : 1,442
క్లస్టర్లు : 44
మొత్తం ఓటర్లు 2,31,851
పురుషులు: 1,15,141
మహిళలు : 1,16,705
ఇతరులు: 05
ఫ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ
ఫ 44 క్లస్టర్లలో ఏర్పాట్లు పూర్తి
ఫ డిసెంబర్ 11న 159 పంచాయతీలు, 1,442 వార్డులకు పోలింగ్


