నియమావళిని పటిష్టంగా అమలు చేస్తాం
సూర్యాపేట టౌన్ : సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా జిల్లాలో ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తామని ఎస్పీ నరసింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోడ్ అమలులో ఉన్నందున ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని కోరారు. అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసు నిఘా ఉంటుందని తెలిపారు. మద్యం అమ్మకాలపై నిఘా ఉంచామని, రహదారుల వెంట హోటళ్లు, డాబాల్లో మద్యం అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక పండుగలా జరగాలని, అందరూ చట్టాన్ని గౌరవిస్తూ శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని కోరారు. జిల్లాలోకి అక్రమ రవాణా జరగకుండా, అక్రమంగా మద్యం ఇతర వస్తువులు రవాణా కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి నిఘా పెడతామని వెల్లడించారు. ప్రజలు ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, డయల్ 100 కు, పోలీస్ కంట్రోల్ రూం 8712686057 , సోషల్ బ్రాంచ్ కంట్రోల్ రూం 8712686026 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని సూచించారు. సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎన్నికల సమయంలో ఎన్నికల కేసులు నమోదైతే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ


