రిజర్వేషన్లను పునఃపరిశీలించాలి
హుజూర్‌నగర్ : పాలకవీడు మండలంలో పంచాయతీ రిజర్వేషన్లను అధికారులు పునః పరిశీలించాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు కోరారు. ఈ మేరకు మంగళవారం బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో హుజూర్‌నగర్ పట్టణంలోని ఆర్‌డీఓ కార్యాలయం ముందు నల్ల కండువాలు మెడలో వేసుకొని మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. అనంతరం ఆర్‌డీఓ శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకవీడు మండలంలో 22 గ్రామ పంచాయతీలు ఉండగా కనీసం బీసీలకు ఒక్క స్థానం కూడా రిజర్వేషన్ ద్వారా కేటాయించలేదన్నారు. ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాపోలు నవీన్ కుమార్, కొండమీది నరసింహారావు, పి. కనకయ్య, చిలకరాజు శ్రీను, కె. వెంకట్, ఎ. నాగేంద్రబాబు, ఎ. వెంకటేశ్వర్లు, కొండా నాయక్, నరసింహ, పి. నాగయ్య, ఎస్. కృష్ణ పాల్గొన్నారు.


