త్రిపురారం : రైతులు వానాకాలం వరి కోతలు పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు రైతులు యాసంగి వరి సాగుకు నారుమడులు సిద్ధం చేసుకొని నారు పోసుకోవడానికి తయారవుతున్నారు. అయితే రైతులు విత్తనాల కొనుగోలులో తగిన జాగ్రత్తలు పాటించాలని త్రిపురారం మండల వ్యవసాయ అధికారి పార్వతి చౌహన్ సూచిస్తున్నారు. అనుమతులు లేని కంపెనీలకు చెందిన విత్తనాలు, కల్తీ విత్తనాలు మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉండటంతో.. రైతులు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అన్ని వివరాలు పరిశీలించాకే విత్తనాలు కొనుగోలు చేయాలని ఆమె పేర్కొంటున్నారు. విత్తనాల కొనుగోళ్లలో పాటించాల్సిన జాగ్రత్తలు ఆమె మాటల్లోనే..
ఫ రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించడం ఉత్తమం.
ఫ ఎలాంటి అనుమాలు తలెత్తినా వెంటనే వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు సమాచారం అందించాలి.
ఫ మండల కేంద్రాలు, గ్రామాల్లో లైసెన్స్ లేని దుకాణాలు, దళారుల వద్ద విత్తనాలు కొనుగోలు చేయకూడదు.
ఫ సరుకు లాట్ నంబర్, తయారీ తేదీ, రకం ఇలా అన్ని వివరాలు ఉండేలా చూసుకోవాలి.
ఫ విత్తనాలు కొనుగోలు సమయంలో రశీదు తప్పకుండా తీసుకోవాలి. రశీదుపై డీలరు, రైతు సంతకం తప్పకుండా ఉండాలి.
ఫ రశీదు పంటకాలం పూర్తయ్యేంత వరకు భద్రపర్చుకోవాలి.
ఫ స్థానిక పరిస్థితులకు అనుకూలమైన, దిగుబడి ఇచ్చే నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి.
ఫ విత్తన సంచుల సీల్ తీసినట్లు లేదా విప్పతీసి తిరిగి కుట్లు వేసినట్లు గమనిస్తే కొనుగోలు చేయొద్దు.
ఫ వ్యవసాయ శాఖ అనుమతులు పొందిన డీలర్లు, మార్కెట్ కమిటీలు, ప్రాథమిక సహకార సంఘాలు, కృషి విజ్ఞాన కేంద్రం, వరి పరిశోధనా స్థానాల్లో మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయడం ఉత్తమం.
విత్తనాలు కొంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి


