కేవలం డబ్బు సంపాదనే రేవంత్ లక్ష్యం
సూర్యాపేట టౌన్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి విమర్శించారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం పెద్దఎత్తున భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇండస్ట్రియల్ కార్పొరేషన్‌కు కేటాయించిన భూముల్లో ప్రభుత్వ మోసం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కోకాపేటలో ఎకరం రూ.100కోట్ల నుంచి రూ.170 కోట్లు వేలంలో విక్రయించినట్లు చెబుతున్న ప్రభుత్వం.. ఇప్పుడు అదే ప్రాంతంలో అతి తక్కువ ధరకు విక్రయించడంలో అర్థమేమిటని ప్రశ్నించారు. ప్రజాధనం దోచుకోవడంపైనే రేవంత్ సర్కార్ దృష్టి పెట్టిందన్నారు. ప్రజల, ప్రభుత్వ ఆస్తులను దోచుకున్న వారు ఎవరైనా వదిలిపెట్టమని, భూ కుంభకోణంలో సహకరించిన వాళ్లంతా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలులో గోల్‌మాల్ జరుగుతోందని, ఐకేపీ సెంటర్లలో సరిగ్గా ధాన్యం కొనడం లేదన్నారు. దళారుల చేతుల్లో రైతులు తీవ్రంగా మోసపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ 2014కు ముందున్న సమస్యలే తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. బీసీలను పెద్దఎత్తున మోసం చేసిన పార్టీ కూడా కాంగ్రెస్సేనని, రేవంత్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చి విస్మరించిందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ ఉన్న రిజర్వేషన్లు పోగొట్టుకునే పరిస్థితి తెచ్చిందన్నారు.
29న దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి
ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా ముఖ్యనేతలతో సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రోజు నవంబర్ 29 అని, తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. అన్న నినాదమే ఉద్యమానికి ఊపిరి పోసిందన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్షతోనే కేంద్రం మెడలు వంచిందని, తద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్టానికే ఆదర్శంగా సూర్యాపేటలో దీక్షా దివస్ నిర్వహించుకుందామని చెప్పారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగులు లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, ఒంటెద్దు నర్సింహారెడ్డి, గుజ్జ యుగంధర్‌రావు పాల్గొన్నారు.
ఫ కోకాపేటలో భూముల ధర
ఇప్పుడు ఎందుకు తగ్గింది
ఫ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శ


