తేలిన రిజర్వేషన్ల లెక్క | - | Sakshi
Sakshi News home page

తేలిన రిజర్వేషన్ల లెక్క

Nov 24 2025 7:18 AM | Updated on Nov 24 2025 7:18 AM

తేలిన రిజర్వేషన్ల లెక్క

తేలిన రిజర్వేషన్ల లెక్క

రెండు రోజులుగా

ఆశావహుల ప్రదక్షిణలు

రెవెన్యూ డివిజన్ల వారీగా రిజర్వేషన్లు

భానుపురి (సూర్యాపేట) : గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో రెండుమూడు రోజులుగా జిల్లా అధికార యంత్రాంగం తీవ్ర కసరత్తు చేపట్టింది. ఇప్పటికే బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా అన్ని రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా లెక్కించి కేటాయించారు. 2019 ఎన్నికల నాటి రిజర్వేషన్లతో రొటేషన్‌ పద్ధతిలో పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లను అమలు చేశారు. ఆదివారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆర్డీఓ కార్యాలయాల్లో సర్పంచ్‌ల రిజర్వేషన్లు, ఎంపీడీఓ కార్యాలయాల్లో వార్డు సభ్యుల రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను పూర్తిచేశారు. అర్ధరాత్రి అధికారికంగా ప్రకటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించి ఎన్నికలకు వెళ్లడం, హైకోర్టు రద్దు చేయడంతో రిజర్వేషన్ల కథ మళ్లీ మొదటికి వచ్చింది. తాజాగా ప్రకటించిన జాబితాలో ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో పెద్దగా మార్పు లేకపోగా.. బీసీలకు కేటాయించిన సీట్లు భారీగా తగ్గాయి. అయితే 2019 పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లతో పోలిస్తే బీసీలకు స్వల్పంగా మూడు స్థానాలు మాత్రమే పెరిగాయి.

బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక ప్రకారం..

ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు రావడంతో వారం రోజులుగా కలెక్టరేట్‌లో యంత్రాంగం బిజీబిజీగా ప్రక్రియను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 2019 ఎన్నికల సమయంలో అమలైన రిజర్వేషన్ల వివరాలను రెండురోజులుగా అధికారులు సేకరించారు. ఈనెల 21న గ్రామ పంచాయతీల్లో ఓటరు జాబితాను ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరించారు. బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక, గత ఎన్నికల రిజర్వేషన్లను రొటేషన్‌ చేస్తూ సర్పంచ్‌, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేయగా.. ఇందులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా డ్రా పద్ధతిలో కేటాయించారు. తుది ఓటరు జాబితాను సోమవారం ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే అధికారులు జిల్లాలో అన్ని పోలింగ్‌ బూత్‌లు, బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం చేసుకున్నారు. నోటిఫికేషన్‌ వస్తే పూర్తిస్థాయిలో ఎన్నికల విధుల్లో నిమగ్నం కానున్నారు.

రిజర్వేషన్ల కేటాయింపు ఇలా..

జిల్లాలో 486 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎస్టీలకు 111 స్థానాలు, ఎస్సీలకు 91, బీసీలకు 68, జనరల్‌ కేటగిరీకి 216, ఇందులోనే మహిళలకు 215 స్థానాలు కల్పస్తూ రిజర్వేషన్లు ఖరారు చేశారు. అయితే ఇటీవల ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయగా అప్పుడు ఎస్టీలకు 111, ఎస్సీలకు 91, బీసీలకు 177, జనరల్‌ కేటగిరీకి 107 స్థానాలను కేటాయించారు. ప్రస్తుత రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకపోగా.. బీసీలకు మాత్రం సుమారుగా 109 సీట్లు తగ్గాయి. ఈ మేరకు జనరల్‌ కేటగిరీ స్థానాలు పెరిగాయి. కాగా 2019 పంచాయతీ ఎన్నికల సమయంలోనూ ఎస్టీలకు 111 స్థానాలు కేటాయించారు. ఎస్సీలకు 97, బీసీలకు 65, జనరల్‌కు 202 స్థానాల చొప్పున రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అయితే సారి జిల్లాలోని చివ్వెంల, పాలకవీడు మండలాల్లో బీసీలకు ఒక్క సీటు కేటాయించలేదు. హుజూర్‌నగర్‌, నడిగూడెం మండలాల్లో ఎస్టీలకు ఒక్కస్ధానం రిజర్వేషన్‌లో దక్కకపోవడం గమనార్హం. గతంతో పోలిస్తే ఈసారి బీసీలకు 3 స్థానాలు పెరగ్గా ఎస్సీలకు 6 స్థానాలు తగ్గాయి. ఇక జనరల్‌ కేటగిరీకి 14 స్థానాలు పెరిగాయి.

గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు

ఫ బీసీలకు మొత్తం 68 స్థానాలు

ఫ గత ఎన్నికల కంటే 3 స్థానాలు అధికం

ఫ ఎస్సీలకు తగ్గిన ఆరు స్థానాలు

ఫ జనరల్‌కు 14 స్థానాలు పెరుగుదల

ఫ రిజర్వేషన్లు 50 శాతానికి

మించకుండా కసరత్తు

ఫ రొటేషన్‌ పద్ధతిలో

కేటగిరీ వారీగా కేటాయింపు

సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి రెండేళ్లు కావస్తున్నా.. ఎన్నికలు నిర్వహించకపోవడంతో నాయకుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. బీసీలకు 42 శాతం కేటాయిస్తూ ఇటీవల ముందుకెళ్లినప్పటికీ కోర్టు తీర్పుతో ఆగిపోయింది. ప్రస్తుతం మళ్లీ ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో ఏవైనా రిజర్వేషన్లు మారాయా..? అని ఆశావహులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో రాజకీయ నాయకుల సమక్షంలోనే రిజర్వేషన్లు తీయడంతో దాదాపు అందరికీ రిజర్వేషన్లు సైతం తెలిసిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి నెలకొంది.

డివిజన్‌ పంచాయతీలు ఎస్టీ ఎస్సీ బీసీ జనరల్‌

సూర్యాపేట 249 73 46 27 103

కోదాడ 91 09 19 20 43

హుజూర్‌నగర్‌ 146 29 26 21 70

మొత్తం 486 111 91 68 216

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement