బీపీ, షుగర్ పెరుగుతోంది..
రోజూ వ్యాయామం చేయాలి
సూర్యాపేటటౌన్ : జిల్లాలో అసాంక్రమిక వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రక్తపోటు (బీపీ), మధుమేహం(షుగర్)తో పాటు క్యాన్సర్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రభుత్వం 2018 నుంచి నిర్వహిస్తున్న అసాంక్రమిక వ్యాధుల నిర్ధారణ సర్వేలో ఈ వ్యాధుల గల వారు బయటపడుతున్నారు. బీపీ, షుగర్ వ్యాధి ఒకప్పుడు 30ఏళ్ల పైబడిన వారికే వచ్చేది. ప్రస్తుతం మారిపోయిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, పని ఉద్యోగం, ఇతరత్రా ఒత్తిడి వంటి వాటి కారణాలతో 25ఏళ్ల నుంచి 30ఏళ్లలోపు వారుకూడా వాటి బారిన పడుతున్నారు. ఇక 30ఏళ్లు దాటిన వారిలో సగం మందిని బీపీ, షుగర్ వదలడం లేదని వైద్యారోగ్యశాఖ, ప్రైవేట్ పరిశోధన సంస్థల సర్వేలు సైతం వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా శారీరక శ్రమ లేకపోవడం, ఒకేచోట కూర్చొని ఒత్తిడిలో పనిచేసే సాప్ట్‌వేర్, ఇతర రంగాలకు చెందిన ఉద్యోగులు కూడా వీటి బారిన పడుతున్నారు. అందుకే ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి సారించింది.
30ఏళ్లు దాటిన వారిపై వైద్యారోగ్య శాఖ సర్వే
ఎన్‌సీడీ(నాన్ కమ్యునికేబుల్ డిసీజెస్) కార్యక్రమంలో భాగంగా 30ఏళ్లు దాటిన వారితో ఏటా వైద్యారోగ్యశాఖ సర్వే నిర్వహిస్తోంది. జిల్లాలో 303 మంది ఏఎన్‌ఎం, 100 మందికి ఎంఎల్‌హెచ్‌పీ, ఆశా కార్యకర్తలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి ఏఎన్‌ఎం రోజూ పది మందికి బీపీ, షుగర్, ఇతర పరీక్షలు నిర్వహిస్తున్నారు.
బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులే ఎక్కువ..
ప్రభుత్వం నాన్ కమ్యునికేబుల్ డిసీజెస్(ఎన్‌సీడీ) స్క్రీనింగ్‌కు ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్‌తో పాటు బీపీ, షుగర్‌పరీక్షలను వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. ఇందులో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులే అత్యధికంగా ఉంటున్నట్టు వైద్యారోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. 30ఏళ్ల వయసు దాటిన వారికి మాత్రమే వైద్యారోగ్యశాఖ ఈ పరీక్షలను నిర్వహిస్తుంది. జిల్లాలో 30ఏళ్ల వయస్సు దాటిన 6,49,086 మందికి పరీక్షలు చేయగా 1,42,110 మంది బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులే ఉన్నట్లు తేలింది. వీరికి ప్రతినెలా పీహెచ్‌సీల్లో ఉచితంగా మందులు అందిస్తున్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా మొత్తం 997 మందికి వివిధ రకాల క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉన్నట్టు తేల్చారు. ఇంకా తమ దృష్టికి రాని బాధితులు అధిక సంఖ్యలో చికిత్స పొందుతున్నట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఎన్‌డీసీ సర్వేలో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులే అధికంగా ఉన్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
షుగర్, బీపీ సమ్యల బారిన పడకుండా ఉండాలంటే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా అవసరమంటున్నారు వైద్యులు. ముఖ్యంగా సమతుల పోషకాహారం తీసుకోవాలి. నూనెతో చేసిన ఆహార పదార్థాలు, జంక్, ప్యాకేజ్డ్ ఫుడ్స్‌ను వీలైనంత దూరం పెట్టాలి. మద్యం, దూమపానం చేయకూడదు. నిత్యం యోగా, ధ్యానం చేయాలి. నడక, వ్యాయామానికి రోజు గంట సమయం కేటాయించాలి. అన్నింటికంటే ముఖ్యంగా మీ వయస్సు, ఎత్తుకు తగ్గట్టు బరువు ఉండాలి. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
30 ఏళ్లలోపు వారికే
అసాంక్రమిక వ్యాధులు
ఫ క్యాన్సర్ కూడా విస్తరిస్తోంది
ఫ వైద్యారోగ్య శాఖ సర్వేలో వెల్లడి
ఫ శారీరక శ్రమ లేకపోవడం,
ఆహారపు అలవాట్లే కారణం
ఫ నిత్యం వ్యాయామం
చేయాలంటున్న వైద్యులు
ఎన్‌సీడీ సర్వే వివరాలు..
బీపీ ఉన్నట్లు గుర్తించిన
వారి సంఖ్య : 86244
షుగర్ బాధితులు : 55,866
సర్వైకల్ క్యాన్సర్ : 373
బ్రెస్ట్ క్యాన్సర్ : 258
ఓరల్ క్యాన్సర్ : 134
ఇతర క్యాన్సర్ల బాధితులు : 232
ప్రస్తుత జీవన విధానంలో ప్రతిఒక్కరూ వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయడం తప్పనిసరి. ఆరు నెలలకోసారి కచ్చితంగా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. బీపీ, షుగర్ ఉన్నవారు వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి. అలాగే తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. జంక్‌ఫుడ్, వేపుళ్లకు దూరంగా ఉంటే చాలా మంచిది.
– డాక్టర్ పెండెం వెంకటరమణ,
జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి
బీపీ, షుగర్ పెరుగుతోంది..


