94.698 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
నేరేడుచర్ల : ప్రస్తుత సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 346 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 94,698 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్‌ఓ) వి.మోహన్‌బాబు అన్నారు. ఆదివారం నేరేడుచర్ల మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయా కేంద్రాల ద్వారా రైతుల నుంచి 41.626 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం, 53.071 మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. 6,451 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యానికి రూ.3.22 కోట్లు బోనస్ కూడా చెల్లించామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 3,67,710 రేషన్‌కార్డుల్లో 10,71,021 మంది లబ్ధిదారులకు ప్రతినెలా 6,042 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ దుకాణాలకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆయన వెంట ఎంపీడీఓ సోమ సుందర్‌రెడ్డి, ఎంపీఓ నాగరాజు తదితరులు ఉన్నారు.
సీపీఐ బహిరంగ సభను
జయప్రదం చేయాలి
తుంగతుర్తి: ఖమ్మం జిల్లా కేంద్రంలో వచ్చేనెల 26 జరగనున్న సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలీఉల్లా ఖాద్రి పిలుపునిచ్చారు. ఆదివారం తుంగతుర్తిలో కొనసాగిన ప్రచార యాత్రలో ఆమె మాట్లాడారు. ఈ సభకు ప్రజాస్వామిక వాదులు, మేధావులు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి డీజీ.నరేంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షుడు ఉప్పలయ్య, నాయకులు ఎల్లంల యాదగిరి, గుగులోతు రాజారాం, కోట రామస్వామి, పున్నయ్య, ఫయాజ్, ఏక్ బాల్, శ్రీకాంత్, మల్లయ్య, మనోజ్‌కుమార్ పాల్గొన్నారు.
ఉద్యోగాల కల్పనకు
ఏటా జాబ్‌మేళా
సూర్యాపేటటౌన్ : నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఏటా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని ఆ విశ్వవిద్యాలయ డైరెక్టర్ వై.వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర సార్వత్రిక అధ్యయన కేంద్రంలో విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ను కళాశాల సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ ఎన్‌ఎస్‌ఆర్ శాస్త్రి, ఇన్‌చార్జి ప్రసాద్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆల య తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఇన్‌చార్జి ఈఓ బి.జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, ఫణిభూషణమంగాచార్యులు, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
94.698 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు


