వేధిస్తే..ఊచలే!
ఆకతాయిల ఆటకట్టిస్తున్న షీటీమ్
నిర్భయంగా పోలీసులను
సంప్రదించాలి
మహిళలు, యువతులు ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చు. వేధింపులు ఉపేక్షించకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. మహిళల రక్షణ కోసమే షీ టీమ్స్ కృషి చేస్తున్నాయి. మహిళలు, బాలికలపై ఆన్‌లైన్‌లో అసభ్యకర పోస్టులు పెట్టే వారు, సైబర్ నేరగాళ్లపై కూడా సైబర్, షీ టీమ్ సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. మహిళలు, బాలికలు, విద్యార్థులు షీటీమ్ సేవలు వినియోగించుకోవాలి.
– నరసింహ, ఎస్పీ
సూర్యాపేటటౌన్ : మహిళలు, బాలికలకు షీటీమ్ భరోసా కల్పిస్తోంది. వారిపై ఆకతాయిల ఆగడాలకు చెక్ పెట్టేందుకు విస్తృతంగా పనిచేస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలల్లో ఈవ్ టీజింగ్, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. విద్యాసంస్థలు, కాలనీలు, రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో గస్తీ చేపట్టి ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. గత అక్టోబర్‌లో షీ టీమ్‌కు మొత్తం 21 ఫిర్యాదులు అందగా.. ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని 31 కేసులు నమోదు చేశారు. అదేవిధంగా 44 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా..
షీటీమ్ బృందంలో ఒక ఎస్సై, ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు మహిళా పోలీసులు, ఇద్దరు సాధారణ కానిస్టేబుళ్లు ఉంటారు. ఈ బృందం జిల్లాలోని పట్టణ ప్రాంతాలతోపాటు, పలు మండల కేంద్రాల్లో నిఘా ఉంచి, మహిళలకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రద్దీగా ఉండే బస్టాండ్‌లు, కళాశాలలు, పాఠశాలలు తదితర ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత నెలలో కోదాడ డివిజన్ 21 ప్రాంతాల్లో, సూర్యాపేట డివిజన్‌లో 25 ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. మొత్తంగా ఈ ఏడాది కోదాడ డివిజన్‌లో 158 అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా.. సూర్యాపేట డివిజన్‌లో 188 కార్యక్రమాలు నిర్వహించారు.
ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
విద్యార్థినులు, మహిళలు, యువతులు వేధింపులకు గురైతే నేరుగా షీటీమ్ వాట్సాప్ నంబర్ 87126 86056కు లేదా డయల్ 100 ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌లో ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసే సమయంలో మహిళలు తమ వ్యక్తిగత భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. బాల్య వివాహాలు, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, సెల్ఫ్ డిఫెన్స్, డయల్ 100, సోషల్ మీడియా నేరాలపై అవగాహన కల్పిస్తూ చైతన్య పరుస్తున్నారు.
బస్టాండ్‌లు, కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన సదస్సుల నిర్వహణ
వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయాలంటున్న పోలీసులు
ఈ ఏడాదిలో ఇప్పటివరకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని 282 కేసులు నమోదు


