ఆదాయం చేకూర్చేలా ప్రణాళికలు రూపొందించాలి
భానుపురి (సూర్యాపేట) : వ్యర్థాల ద్వారా ఆదాయం చేకూర్చేలా మున్సిపల్ అధికారులు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ నుంచి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లతో వ్యర్థాల నిర్వహణపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో సేకరించిన వ్యర్థాలను డంపింగ్ యార్డ్‌లు, వ్యర్థాలను వేరు చేసే కేంద్రాలకు తరలించాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో వ్యర్థాలను వేరు చేసే కేంద్రాలు కార్యకలాపాలు నిర్వహించేలా చూడాలని సూచించారు. పర్యావరణానికి హాని కలిగించే విష పదార్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు, కాలుష్య నీరు చెరువులు, కాలువల్లో కలవకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌కు అదనపు కలెక్టర్ సీతారామారావు, మున్సిపల్ కమిషనర్లు హన్మంత రెడ్డి, రమాదేవి, శ్రీనివాస రెడ్డి, మున్వర్ అలీ, ఇంజనీరింగ్ అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు తదితరులు హాజరయ్యారు.
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


