వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి
సూర్యాపేట అర్బన్ : వ్యవసాయ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర చట్టం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో నిర్వహించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.12,000 ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయడం లేదని ఆరోపించారు. అంతకుముందు వ్యవసాయ కార్మిక సంఘం జెండాను సంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు ఆవిష్కరించారు. అనంతరం వ్యవసాయ కార్మిక ఉద్యమ నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, మల్లు వెంకట నరసింహారెడ్డి, వర్ధిల్లి బుచ్చి రాములు చిత్రపటాలకు నివాళులర్పించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు ప్రిన్సిపల్‌గా వ్యవహరించగా.. జిల్లా ఆఫీస్ బేరర్స్ సోమపంగ జానయ్య, నల్ల మేకల అంజయ్య, జంపాల స్వరాజ్యం, వెంకటేశ్వర్లు గుంజ వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


