రైతుకు సాగు చట్టాలపై అవగాహన అవసరం
తుంగతుర్తి : ప్రతి రైతుకు సాగు చట్టాలపై అవగాహన కలిగి ఉండటం అవసరమని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు భూమి సునీల్ పేర్కొన్నారు. లిప్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ సాగు న్యాయ యాత్ర లో భాగంగా సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దళారీ వ్యవస్థ పూర్తిగా నిర్మూలించినప్పుడే సాగు న్యాయం సాధ్యమవుతుందన్నారు. రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు, నాణ్యతలేని విత్తనాలు, ఎరువుల మోసాలు, మార్కెట్‌లో అన్యాయం, పంటల బీమా వంటి కీలక అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో 200కుపైగా భూ చట్టాలు ఉన్నాయని, అవన్నీ రైతులకు ఉపయోగపడేలా అవగాహన కల్పించడమే ఈ యాత్ర లక్ష్యమని పేర్కొన్నారు. భూమి ఉండి పాసుపుస్తకం లేకపోయినా, ఇతర ఏ భూ సమస్య ఉన్నా ప్రభుత్వ నిర్దేశించిన నమూనాలో మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం గొట్టిపర్తి లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, తుంగతుర్తి లోని వరి పొలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దయానందం, లిప్స్ సంస్థ ప్రతినిధులు, అడ్వకేట్లు జీవన్,రవి, అభిలాష్, సందీప్, దాయం కరుణాకర్ రెడ్డి, కేతిరెడ్డి కరుణాకర్ రెడ్డి, ఏడీఏ రమేష్ బాబు, డిప్యూటీ తహసీల్దార్ యాదగిరి, ఆర్‌ఐ లు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.


