అర్జీల పరిష్కారానికి చొరవ చూపాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులు సత్వరమే పరిష్కారానికి చొరవ చూపాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణికి అధికారులు విధిగా హాజరై ఫిర్యాదులపై శాఖల వారీగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరించాలన్నారు. వారం రోజుల్లో ప్రజావాణి ఫిర్యాదుల స్టేటస్‌పై సమీక్ష నిర్వహిస్తానన్నారు. కోర్టు కేసులు ఏమైనా పెండింగ్ ఉంటే తదుపరి వాయిదా నాటికి కౌంటర్ ఫైల్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలకు స్థలం అవసరం ఉంటే తెలిపాలని, అలాగే ప్రభుత్వ కార్యాలయాల భూముల వివరాలు రికార్డుల్లో అప్డేట్ చేయాలన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు మంగళవారం జిల్లాలోని విద్యాసంస్థలు, గ్రామస్థాయిలో ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు.
48గంటల్లో ధాన్యం డబ్బులు
జమయ్యేలా చూడాలి
సూర్యాపేట : రైతుల అకౌంట్లలో 48 గంటల్లో ధాన్యం డబ్బులు జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం సూర్యాపేట మండలం గాంధీనగర్, యర్కారం గ్రామాల్లోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు బాలెంల–1 ఐకేపీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. తేమ శాతాన్ని పరిశీలించారు. సీరియల్ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. తేమ శాతం 17 వచ్చిన ధాన్యాన్ని సీరియల్ ప్రకారం కాంటా వేసి మిల్లులకు తరలించాలన్నారు. వెంటనే ట్రక్ షీట్, ట్యాబ్ ఎంట్రీ చేసి రైతులకు డబ్బులు జమ చేసేలా చూడాలన్నారు. సరైన తేమ శాతం వచ్చినా ధాన్యం కాంటా విషయంలో జాప్యం చేస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరైన తేమ శాతం వచ్చేంతవరకు ధాన్యం ఆరబెట్టాలని, మట్టి, తాలు, దుమ్ము, గడ్డి లేకుండా శుభ్రం చేసి తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. కలెక్టర్ వెంట డీఎస్‌ఓ మోహన్ బాబు, డీఎం రాము, తహసీల్దార్ కృష్ణయ్య, ఏఓ సందీప్, ఏఈఓలు, ఏపీఎం, పీఏసీఎస్ కార్యదర్శిలు నాగరాజు, వెంకటరెడ్డి, నిర్వాహకురాలు వెంకటమ్మ ఉన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


