స్టడీ అవర్స్ సరే.. అల్పాహారమేదీ?
చిలుకూరు: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే 9, 10 తరగతుల విద్యార్థులకు అల్పాహారం అందడం లేదు. సెప్టెంబర్ నుంచి విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 4.20 నుంచి 5.20గంటల వరకు స్టడీ అవర్ కొనసాగుతోంది. అయితే పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నం తిని సాయంత్ర స్టడీ అవర్ వరకు ఏమీ తినకుండా ఉండాలంటే విద్యార్థులు నీరసించి చదువుపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు. అయినా నేటి వరకు ప్రభుత్వం అల్పాహారం అందించేందుకు నిధులు విడుదల చేయడం లేదు. ప్రతిరోజూ స్టడీ అవర్ ముగించుకుని ఇంటికెళ్లే సరికి 6 గంటలు అవుతుండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
రెండు నెలలు దాటినా..
జిల్లా వ్యాప్తంగా 229 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థులు 17వేల మంది ఉన్నారు. వీరికి ప్రత్యేక స్టడీ అవర్స్ ప్రారంభించి ఇప్పటికీ 76 రోజులు దాటినా ఎలాంటి అల్పాహారం పెట్టడం లేదు. గతంలో ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 విలువైన అల్పాహారం అందజేశారు. ఇందుకు కావాల్సిన నిధులను పాఠశాలల ఖాతాల్లో జమచేసి అల్పాహారం అందించారు. ఇందుకుగాను గతంలో అల్పాహారం మెనూను ప్రత్యేకంగా రూపొందించారు. గతంలో స్టడీ అవర్స్‌లో అల్పాహారం అందించి ఇప్పుడు పెట్టకపోవడంతో తమ పిల్లలు నీరసించి పోతున్నారని, ఇంటికొచ్చాక కనీసం హోం వర్క్ కూడా చేసుకోలేని పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు అంటున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి స్టడీ అవర్స్‌కు హాజరయ్యే 9, 10వ తరగతుల విద్యార్థులకు అల్పాహారం అందించాలని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఫ 9, 10 విద్యార్థులకు సెప్టెంబర్
నుంచి మొదలైన స్టడీ అవర్స్
ఫ సాయంత్రం 4.20 నుంచి
5.20 గంటల వరకు నిర్వహణ
ఫ అల్పాహారం లేక
నీరసించి పోతున్న విద్యార్థులు


