నిర్మించుకోకుంటే ఇల్లు రద్దే | - | Sakshi
Sakshi News home page

నిర్మించుకోకుంటే ఇల్లు రద్దే

Nov 17 2025 10:11 AM | Updated on Nov 17 2025 10:11 AM

నిర్మించుకోకుంటే ఇల్లు రద్దే

నిర్మించుకోకుంటే ఇల్లు రద్దే

45 రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభించాలి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై

కొనసాగుతున్న సర్వే

నిర్మించని వాటిని గుర్తిస్తున్న అధికారులు

వచ్చే నెలలో రెండో విడత

లబ్ధిదారుల గుర్తింపు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు మంజూరైన 45 రోజుల్లో నిర్మాణం ప్రారంభించాలి. అలా ప్రారంభించకపోతే రద్దు అవుతుంది ఆరు నెలలైనా 34శాతం మంది లబ్ధిదారుల నిర్మాణాలు ప్రారంభించలేదు. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తాం

– సిద్ధార్థ్‌, హౌసింగ్‌ పీడీ, సూర్యాపేట

సూర్యాపేట అర్బన్‌ : నిర్మానాలు ప్రారంభించని ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇల్లు మంజూరైన వారు 45 రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభించాలి. కానీ ఆరు నెలలుగా దాటుతున్నా జిల్లాలో రెండువేల మందికిపైగా లబ్ధిదారులు ఇంకా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో నిర్మాణాలు ప్రారంభించని వాటి రద్దుచేసి కొత్తవారికి కేటాయించేందుకు అంతటా సర్వే చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎల్‌–1 కింద సొంత స్థలాలు ఉన్నవారు, ఎల్‌–2 కింద సొంత స్థలం కానీ ఇల్లు కాని లేనివారు, ఎల్‌–3 కింద ఇతరులు అని మూడు జాబితాలుగా అధికారులు నిర్ధారించి దరఖాస్తులు స్వీకరించారు. అప్పట్లో తమ పేర్లు ఎల్‌–1 కింద రావాల్సి ఉండగా ఎల్‌–2 కింద వచ్చాయని సరిచేసి ఎల్‌–1 కింద చేర్చాలని చాలామంది అధికారులకు అర్జీలు సమర్పించారు. ప్రస్తుతం నిర్మాణం మొదలుపెట్టని ఇళ్లను రద్దుచేసి నిర్మించుకునే వారికి ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు.

67 శాతం ఇళ్ల పనులు ప్రారంభం

జిల్లాలో మొతం 8,112 మందికి ఇళ్లు మంజూరు చేశారు. ఇందులో 5,494 మంది (67 శాతం) లబ్ధిదారులకు అధికారులు మార్క్‌ అవుట్‌ ఇవ్వగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. ఇందులో ఇప్పటి వరకు 72 ఇళ్లు నిర్మాణం పూర్తయినట్టుగా అధికారులు గుర్తించారు. మిగతా వాటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. కాని ఇప్పటి వరకు 2,618 లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదని అధికారులు గుర్తించారు.

రద్దుకు అధికారుల సర్వే

నిర్మాణాలు ప్రారంభించని ఇళ్ల రద్దు చేసేందుకు ఎంపీడీఓ, హౌసింగ్‌ ఏఈ, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో అధికారులు గుర్తిస్తున్నారు. తాము కట్టుకోలేని పరిస్థితి ఉందని లబ్ధిదారులు పేర్కొంటే వాటిని అధికారులు రద్దు చేస్తారు లేదా ప్రారంభించుకునేందుకు సిద్ధంగా ఉంటే మార్క్‌ అవుట్‌ ఇస్తారు. వచ్చే ఏడాది నిర్మించుకుంటామని పేర్కొంటే ప్రస్తుతం రద్దుచేసి వచ్చే ఏడాది మంజూరు చేయనున్నారు. రద్దు చేసిన ఇళ్లను నిర్మించుకునేందుకు సిద్ధంగా ఉన్న వారికి మంజూరు చేయనున్నారు. వచ్చే నెల మొదటి వారంలో రెండో విడత లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేయనున్నారు.

బిల్లుల భయంతో అనాసక్తి

నిర్మాణాలు చేపట్టినా బిల్లు రావన్న వదంతులు వినిపిస్తున్న కారణంగా చాలామంది ఇళ్ల నిర్మాణాలపై అనాసక్తి చూపుతున్నారు. తద్వారా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బేస్మెంట్‌ పూర్తయితే రూ.లక్ష, రూప్‌ లెవెల్‌కు రూ.లక్ష, ఆర్సీసీ పూర్తయితే రూ.2 లక్షలు నిర్మాణం పూర్తి చేసుకుని రంగులు వేశాక మరో రూ.లక్ష చొప్పున మొత్తం రూ.ఐదు లక్షలు చెల్లిస్తున్నారు. నిర్మించుకుని వివిధ దశలో ఉన్న లబ్ధిదారులకు డబ్బులను వారి బ్యాంక్‌ అకౌంట్లలో జమ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement