లక్కీ లాటరీల పేరుతో మోసాలు చేయొద్దు
సూర్యాపేటటౌన్ : స్థిరాస్తి భూముల అమ్మకానికి లక్కీ లాటరీల పేరుతో ఆర్థిక మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో అక్కడక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మరికొంతమంది వ్యవస్థీకృతంగా ఏర్పడి రూ.వెయ్యి కట్టు, ప్లాట్ పట్ట్ఙు అంటూ లక్కీ లాటరీల పేరుతో స్థిరాస్తులు అమ్ముతున్నారని, ఇది చట్టపరంగా నేరమని పేర్కొన్నారు. పోలీసుల దృష్టికి రావడంతో ఇలాంటివి మోసపూరితమైన ఆర్థిక నేరమని కొందరిని హెచ్చరించామని, మళ్లీ ఇలాంటి నేరాలకు ఎవరైనా పాల్పడితే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని పేర్కొన్నారు. ఇలాంటి లాటరీలకు ప్రజలు డబ్బులు కట్టి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.
వేతన సవరణ
రిపోర్టు ప్రకటించాలి
సూర్యాపేటటౌన్ : వేతన సవరణ కమిషన్ రిపోర్టును ప్రకటించి అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్.రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేటలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్.సోమయ్య అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన సవరణ కమిషన్ రిపోర్టును పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఎలను వెంటనే ప్రకటించాలని, రిటైరైన ఉద్యోగ, ఉపాధ్యాయుల పెన్షనరీ బెనిఫిట్స్, సరెండర్, టీఎస్‌జీఎల్‌ఐ, ఈ కుబేర్‌లో పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాస్‌రెడ్డి, కె.అరుణ భారతి, జిల్లా కోశాధికారి జి.వెంకటయ్య, జిల్లా కార్యదర్శులు ఆర్.దామోదర్, ఎన్.నాగేశ్వరరావు, బి.ఆడమ్, వెలుగు రమేష్, బాల సైదిరెడ్డి పాల్గొన్నారు.
ఆధార్ కార్డుతో రావాలి
సూర్యాపేట : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ఈనామ్ 2.0 ప్రారంభమవుతున్నందున పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు వచ్చే రైతులు తమ వెంట తప్పనిరిగా ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ తెచ్చుకోవాలని మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎండి.ఫసీయొద్దీన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు మార్కెట్ యార్డుకు వచ్చినప్పుడు గేట్ వద్ద లాట్ ఐడీ జనరేట్ చేసుకోవాలని కోరారు.
మట్టపల్లి క్షేత్రంలో
పంచామృతాభిషేకం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం విశేష పూజలు కొనసాగాయి. ఈ సందర్భంగా శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల నిత్యకల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని క్షేత్రంలోని శివాలయంలో గల శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామికి పంచామృతాభిషేకం, పూజలు, ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఇన్‌చార్జి ఈఓ బి.జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, ఆంజనేయాచార్యులు, దుర్గాప్రసాద్‌శర్మ, భక్తులు పాల్గొన్నారు.


