టెట్‌కు యువత సిద్ధం
నిరుద్యోగుల్లో ఉత్సాహం
సూర్యాపేటటౌన్ : టీటీసీ, బీఈడీ పూర్తి చేసిన వారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. శనివారం నుంచి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉద్యోగం రావాలంటే టెట్ క్వాలిఫై కావాల్సి ఉండడంతో అభ్యర్థులు భారీ సంఖ్యలోనే దరఖాస్తు చేసుకోనున్నారు. అందుకు గానూ జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జనవరిలో పరీక్ష
రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులుగా స్థిరపడాలనుకునే వారు టెట్‌కు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం కూడా శనివారం నుంచి టెట్‌కు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించింది. ఈ నెల 29 వరకు టెట్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 31 తేదీల మధ్య ఆన్‌లైన్‌లో టెట్ నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధ మవుతున్నారు.
8వేల వరకు దరఖాస్తులు
గతేడాది జూన్ 18 నుంచి 30 వరకు టెట్ పరీక్ష నిర్వహించారు. నిబంధనల మేరకు సరిగ్గా ఆరు నెలల వ్యవధిలో వచ్చే ఏడాది జనవరిలో పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత టెట్ పరీక్షకు జిల్ల నుంచి 5వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రస్తుతం అభ్యర్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో డీఎడ్, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు సుమారు 6వేల మంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరందరూ టెట్ పరీక్షకు దరఖాస్తులు చేసుకోనున్నారు. దీంతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా టెట్ క్వాలిఫై కావాల్సిందేననే ప్రభుత్వ ఉత్వర్వుల మేరకు వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. గతంలో టెట్ క్వాలిఫై అయిన వారు మార్కులు మెరుగు పర్చుకునేందుకు మళ్లీ టెట్ రాసే అవకాశం ఉంది. దాంతో హాజరయ్యే వారి శాతం పెరుగనుంది. ఈ సారి జిల్లాలో అభ్యర్థులు, టీచర్లు కలిపి 8 వేల మంది వరకు టెట్‌కు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉపాధ్యాయులకు టెట్ భయం..
డీఎస్సీ 1995 నుంచి మొన్నటి డీఎస్సీ 2024 వరకు ఉపాధ్యాయులుగా నియమితులైన వారు టెట్ క్వాలిఫై కావాల్సిందేనని ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో మొత్తం 3800 మంది ఉపాధ్యాయులు ఉండగా ఇందులో 1800 మంది వరకు టెట్ క్వాలిఫై కలిగిన వారు ఉండగా మిగిలిన 2వేల మంది టెట్ అర్హత సాధించాల్సి ఉంది. ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ సర్వీస్ టీచర్లు తప్పక పరీక్ష రాయాల్సిందేనని తేల్చిచెప్పింది. దాంతో ఉపాధ్యాయుల్లో ప్రస్తుతం టెట్ భయం పట్టుకుంది. ఇన్ సర్వీస్‌లో ఉన్న ఎస్టీజీటీలు పేపర్– 1, స్కూల్‌అసిస్టెంట్లు పేపర్– 2 రాయాల్సి ఉంది. అయితే ఎంత మంది ఉపాధ్యాయులు టెట్‌కు దరఖాస్తు చేసుకుంటారో చూడాల్సిందే.
జిల్లాలో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులు టెట్‌కు సన్నద్ధమవుతున్నారు. వారంతా ఇప్పటికే టెట్ రాసేందుకు కోచించ్ సెంటర్లను ఆశ్రయించారు. మరి కొందరు గ్రంథాలయాల్లో, ఇంటివద్ద సొంతంగా ప్రిపేర్ అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనుందనే ఊహాగానాల నేపథ్యంలో చాలా మంది టెట్‌లో స్కోరింగ్ మార్కులు తెచ్చుకోవాలనే తపనతో ప్రిపేర్ అవుతున్నారు.
ఫ ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ
ఫ 29వరకు తుది గడువు
ఫ నిరుద్యోగుల్లో కొత్త ఉత్సాహం
ఫ టీచర్లకు ఉత్తీర్ణత భయం
ఫ ఈసారి పెరుగనున్న దరఖాస్తుల సంఖ్య


